Viral Video: లైక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారా?

Viral Video: సోషల్ మీడియాలో 'లైక్లు', 'ఫాలోవర్లు' సంపాదించాలనే పిచ్చి కొందరు యువకులను క్రిమినల్స్‌గా మారుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఒక అమాయక వ్యక్తిని బంధించి, బలవంతంగా పెట్రోల్ తాగించడమే కాకుండా.. అతడి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్యంత దారుణమైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వెలుగుచూసింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 27న పని ముగించుకుని ఇంటికి తిరిగొస్తున్న ఒక వ్యక్తిని కొందరు యువకులు అడ్డుకున్నారు. గర్ఫాలోని హల్టు ప్రాంతంలో ఉన్న ఒక చెరువు సమీపానికి అతడిని బలవంతంగా తీసుకెళ్లారు. ఏదో ఆట ఆడుతున్నామనే నెపంతో బాధితుడి కళ్లకు గంతలు కట్టి, తలపై హెల్మెట్ పెట్టారు. అనంతరం అతడిపై విచక్షణారహితంగా దాడి చేస్తూ పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారు.

అతడు తన హెల్మెట్‌ను తీసివేసేందుకు ప్రయత్నించగా, బాటిల్‌లో తెచ్చిన పెట్రోల్‌ను బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించారు. బాధితుడు తీవ్రంగా ప్రతిఘటించడంతో, వారిలోని ఒకరు అతడిపై పెట్రోల్ పోసి నేరుగా నిప్పు అంటించారు.

క్షణాల్లో ఆ వ్యక్తి చొక్కాకు మంటలు వ్యాపించాయి. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు కాలుతున్న దుస్తులను చించుకుని అక్కడి నుంచి ప్రాణభయంతో కేకలు వేస్తూ పరుగెత్తాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఉన్మాద ఘాతుకంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో 'రీల్' చేసి వైరల్ చేయాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు, ఈ దారుణాన్ని వీడియో రికార్డు కూడా చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడైన అర్ఘ్య సాహాతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పాల్గొన్న ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


Tags: