ఒకర్ని కంటే. రూ. 55 లక్షలు ..ప్రభుత్వం సంచలన ప్రకటన!
Singapore: సింగపూర్‌లో పడిపోతున్న జననాల రేటును అరికట్టేందుకు ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది.
ఒకర్ని కంటే. రూ. 55 లక్షలు ..ప్రభుత్వం సంచలన ప్రకటన!
Singapore: ఆర్థిక అద్భుతాలకు, ఆధునిక జీవనశైలికి చిరునామాగా నిలిచే సింగపూర్ ప్రస్తుతం తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో సంతానోత్పత్తి రేటు 0.87 అనే అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పిల్లల్ని కనేందుకు యువతను ప్రోత్సహించే లక్ష్యంతో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ కుటుంబ మద్దతు ప్యాకేజీని ప్రకటించింది.
దేశ జాతీయ దినోత్సవ ర్యాలీలో ప్రధాని లారెన్స్ వాంగ్ ఈ పథకాన్ని వెల్లడిస్తూ... మీరు పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటే, ప్రభుత్వం మీకు అన్ని వేళలా అండగా నిలుస్తుందిని స్పష్టమైన భరోసానిచ్చారు.
ప్యాకేజీ ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిస్తే.. ఈ పథకం కింద సింగపూర్‌లో పుట్టిన ప్రతి బిడ్డకు 17 ఏళ్లు వచ్చేసరికి సుమారు రూ. 55 లక్షలు లభిస్తాయి. పుట్టిన వెంటనే సుమారు రూ. 7.8 లక్షలు జమ చేస్తారు, అదనంగా సుమారు రూ. 4 లక్షలు, బిడ్డ పెరుగుతున్న కొద్దీ ప్రతి సంవత్సరం సుమారు రూ. 1.6 లక్షలు ఇవ్వడం జరుగుతుంది.
చైల్డ్ కేర్ కేంద్రాల్లో భారీ సబ్సిడీలు, తల్లిదండ్రులకు విస్తరించిన సెలవులు. ప్రభుత్వం నిర్మించే బిల్డ్-టు-ఆర్డర్ ఫ్లాట్ల కేటాయింపు లాటరీలలో పిల్లలున్న కుటుంబాలకు అదనపు అవకాశం. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కుటుంబ , సంతాన ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం సుమారు రూ. 5.5 వేల కోట్లు ఖర్చు చేయనుంది.
1970లలో ఇద్దరు చాలు అంటూ తీవ్రంగా ప్రచారం చేసిన సింగపూర్ ప్రభుత్వం, 1987 నాటికి పరిస్థితిని గ్రహించి తన విధానాన్ని మార్చుకుంది. విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లకు మ్యాచ్‌మేకింగ్ ఈవెంట్లు నిర్వహించినా, ఎన్నో ఆర్థిక సహాయాలు అందించినా యువతలో మార్పు రాలేదు.
ఈ ఆర్థిక ప్రోత్సాహకాలు ఎంతవరకు పనిచేస్తాయనేది సర్వత్రా సందేహంగానే ఉంది. పని ఒత్తిడి, ఖరీదైన జీవనశైలి, పిల్లల పెంపకంలో అధిక వ్యయం వల్ల యువత పిల్లలను వద్దనుకుంటున్నారు. వృద్ధుల జనాభా పెరిగిపోతుండటం, పనిచేసే యువతరం తగ్గిపోతుండటంతో రాబోయే రోజుల్లో వలసదారులను ఆహ్వానించక తప్పదని సింగపూర్ భావిస్తోంది.