Trump Buffalo : బంగ్లాదేశ్ 'ట్రంప్' బతికిపోయాడురోయ్.!
Trump Buffalo : రాజకీయాల్లో అయినా, జంతు ప్రపంచంలో అయినా ‘ట్రంప్’ అనే పేరుకు ఉండే క్రేజే వేరు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్ గురించి మనకు..
Trump-buffalo
Trump Buffalo : రాజకీయాల్లో అయినా, జంతు ప్రపంచంలో అయినా ‘ట్రంప్’ అనే పేరుకు ఉండే క్రేజే వేరు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్ గురించి మనకు తెలిసిందే. సరిగ్గా అలాంటి జులపాల జుట్టు (అదేనండీ.. నెత్తిన కాస్త తెల్లటి, బంగారు రంగు జుట్టు) ఉండటంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక అరుదైన అల్బినో (తెల్ల) గేదెకు స్థానికులు ముద్దుగా "డోనాల్డ్ ట్రంప్" అని పేరు పెట్టారు. అయితే, బక్రీద్ (ఈద్ అల్-అజ్హా) పండుగ వేళ ఈ 'ట్రంప్' తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుని సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.
కుర్బానీ నుంచి నైస్ ఎస్కేప్..
దాదాపు 700 కిలోల బరువున్న ఈ సెలబ్రిటీ గేదెను బక్రీద్ పండుగ సందర్భంగా బలి ఇవ్వడానికి ఓ భక్తుడు భారీ ధర పెట్టి కొనేశాడు. ఇక పండుగ రోజున సీన్ కట్ చేస్తే 'ట్రంప్' కథ క్లోజ్ అనుకున్నారంతా. కానీ, అక్కడే అసలైన ట్విస్ట్ పడింది. ఈ గేదె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, ‘ట్రంప్’ను చూడటానికి జనాలు ఎగబడ్డారు. దాంతో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ.. ఈ అరుదైన జీవిని బలి ఇవ్వకూడదని లాస్ట్ మినిట్ లో ఆర్డర్ పాస్ చేసింది. పాపం.. ఆ గేదెను కొనుక్కున్న భక్తుడికి డబ్బులు రీఫండ్ ఇచ్చి మరీ 'ట్రంప్' ప్రాణాలను కాపాడారు. బహుశా జంతు ప్రపంచంలో ‘సెక్యూరిటీ రీజన్స్’, ‘పబ్లిక్ ఇంట్రెస్ట్’ కారణంగా బలి తప్పించుకున్న ఏకైక అదృష్టవంతుడు ఈ గేదె ట్రంపే కాబోలు..
జైలుకు కాదు.. నేరుగా జూ పార్కుకు..
ప్రస్తుతం ఈ వీఐపీ గేదెను ఢాకాలోని నేషనల్ జూ పార్కుకు తరలించారు. అక్కడ ఈయన కోసం ప్రత్యేకంగా ఒక షెడ్, దానికి తోడు ఒక పర్సనల్ కేర్‌టేకర్ (అసిస్టెంట్)ను కూడా ప్రభుత్వం కేటాయించింది. అయితే, సెలబ్రిటీలు ఎక్కడికి వచ్చినా కాస్త క్వారంటైన్ రూల్స్ ఉంటాయి కదా.. అందుకే ఈ 'ట్రంప్' కూడా ఒక రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉంటాడట. ఆ తర్వాతే ప్రజల సందర్శనార్థం ఈయనని పబ్లిక్ లోకి తీసుకువస్తామని జూ క్యూరేటర్ సెలవిచ్చారు.
యాదృచ్ఛికమో.. కాకతాళీయమో..
ఈ గేదె అసలు యజమాని జియా ఉద్దీన్ మృధా అనే రైతు. వాళ్ల తమ్ముడు సరదాగా పెట్టిన పేరు కాస్తా ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయి కూర్చుంది. ఈ గేదె చాలా ప్రశాంతమైనదని, రోజుకు రెండు సార్లు స్నానం చేయిస్తే గానీ ముద్దుగా ఉండదని యజమాని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది బక్రీద్ పండుగకు దాదాపు కోటి ఇరవై లక్షల జంతువులు కుర్బానీ అవుతుంటే.. మన 'ట్రంప్' మాత్రం కేవలం ఆ పేరు మహిమో, లేక నెత్తిన ఉన్న జులపాల జుట్టు పుణ్యమో కానీ.. చావు అంచుల్లోకి వెళ్లి మరీ బతికి బయటపడ్డాడు. ఏదేమైనా.. "పేరులోనే వైబ్రేషన్ ఉంది బాసూ" అని నెటిజన్లు ఇప్పుడు తెగ కామెంట్లు పెడుతున్నారు..