Air India : గాల్లో విమానం కుదుపులు.. డోప్ టెస్ట్‌లో పైలట్ పాజిటివ్.!
Air India : ఫుకెట్ నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ఘటనలో అత్యంత దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి
Air-India
Air India : ఫుకెట్ నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ఘటనలో అత్యంత దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్రమైన టర్బులెన్స్‌కు గురై, ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు నుండి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదకర పరిస్థితి తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో, విమానాన్ని నడుపుతున్న ఇద్దరు పైలట్లలో ఒకరు డోపింగ్ పరీక్షలో (మత్తు పదార్థాలు/మందుల వాడకం) విఫలమైనట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
అకస్మాత్తుగా పడిపోయిన ఎత్తు.. ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు
సాధారణంగా గాల్లో ప్రయాణించేటప్పుడు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల విమానాలు కుదుపులకు గురికావడం సహజమే అయినా, ఈ ఘటనలో విమానం చాలా వేగంగా ఎత్తును కోల్పోయింది. ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పైలట్ల సమయస్ఫూర్తి లేదా సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందా అన్న అనుమానాలు రాగా, ల్యాండింగ్ తర్వాత జరిపిన వైద్య తనిఖీల్లో పైలట్ డోప్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలడం ఈ ఘటన ప్రాధాన్యతను ఒక్కసారిగా మార్చివేసింది.
ఇద్దరు పైలట్లపై చర్యలు.. విధులకు దూరం
సంఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, ఈ ఉదంతంపై పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యే వరకు విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లను తక్షణమే విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరి పాత్రపై పూర్తి నివేదిక సిద్ధమయ్యే వరకు వీరిని ఎలాంటి విమానాలు నడపడానికి అనుమతించరు.
రంగంలోకి డిజిసిఎ.. విచారణ వేగవంతం
ఈ ఘటనపై దేశీయ విమానయాన నియంత్రణ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సమగ్ర విచారణను ప్రారంభించింది. విమానం డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్ బాక్స్) సమాచారంతో పాటు, పైలట్ల వైద్య నివేదికలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ విచారణలో వెల్లడయ్యే ఆధారాలను బట్టి, ఈ తీవ్రమైన ఉదంతాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి అప్పగించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
స్పందించిన ఎయిర్ ఇండియా యాజమాన్యం
ఈ వివాదంపై ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పందిస్తూ.. విమానం ల్యాండింగ్ ముగిసిన అనంతరం అధికారులు నిర్వహించిన డోపింగ్ తనిఖీల అధికారిక ఫలితాలు లేదా నివేదికలు తమకు ఇంకా అందలేదని తెలిపింది. అధికారిక పూర్వాపరాలు , నివేదిక చేతికందే వరకు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని స్పష్టం చేసింది. అయితే ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని పేర్కొంది.