Vadhandhi Season 2 : ఈ సీక్రెట్ మిస్టరీ మిస్సయితే ఎట్లా.?
Vadhandhi Season 2 Review in Telugu: తమిళ డిజిటల్ స్పేస్‌లో వచ్చి సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'వదంతి'. మొదటి సీజన్‌లో ఎస్.జె. సూర్య
adhandhi-season-2
Vadhandhi Season 2 Review in Telugu: తమిళ డిజిటల్ స్పేస్‌లో వచ్చి సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'వదంతి'. మొదటి సీజన్‌లో ఎస్.జె. సూర్య పోలీస్ ఆఫీసర్‌గా తన నటనతో దుమ్మురేపగా, ఇప్పుడు అంతకుమించిన ఉత్కంఠ, మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో 'వదంతి సీజన్ 2' ప్రేక్షకులను పలకరించింది. ఈసారి ప్రముఖ నటుడు శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్, ఈ నెల 7వ తేదీ నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్ల సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా రూపొందిన ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో, ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఒక్క అస్థిపంజరం.. రోడ్డు తవ్వకాల్లో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్..
చెన్నై నుంచి మధురై వరకు ఎనిమిది లైన్ల భారీ రోడ్డు పనుల కోసం జరిపే మట్టి తవ్వకాలతో ఈ కథ ఊహించని విధంగా ప్రారంభమవుతుంది. ఆ తవ్వకాల్లో ఒక మానవ అస్థిపంజరం బయటపడటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయంగా పెద్ద వివాదమే మొదలవుతుంది. పనిష్మెంట్ పోస్టింగ్ మీద వచ్చిన పోలీస్ ఆఫీసర్ రాజా (శశికుమార్) తన సహచర ఆఫీసర్ రామర్ (వివేక్ ప్రసన్న)తో కలిసి ఈ కేసు విచారణ బాధ్యతలను స్వీకరిస్తాడు. అదే సమయంలో ఈ సంచలన కేసును పర్యవేక్షించేందుకు ఎస్పీ రతికా నాయర్ (అనఘా) రంగంలోకి దిగుతుంది.
అయితే ఆ ఆస్తిపంజరాన్ని పరిశీలించగా దానికి ఒక చేయి లేకపోవడం అధికారులను కలవరపెడుతుంది. దాంతో ఆ ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు జరపగా ఎట్టకేలకు ఒక చేయి భాగాన్ని గుర్తించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తారు. కానీ వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇస్తుంది. లభించిన అస్థిపంజరం ఒకరిది అయితే, అక్కడ దొరికిన చేయి భాగం మరొకరిదని, అవిద్దరూ వేర్వేరు యువతులవని నివేదికలో స్పష్టమవుతుంది. దీంతో కేసు పూర్తిగా ఒక ఊహించని విచిత్ర మలుపు తిరుగుతుంది.
జైల్లో ఉన్నది నిజమైన హంతకుడేనా? – కథలో సరికొత్త యాంగిల్
ఆ ఆనవాళ్లు రెండేళ్ల క్రితం మిస్సయిన ఇద్దరు యువతులవని తేలడంతో రాజా తన ఇన్వెస్టిగేషన్‌ను వేగవంతం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు యువతుల హత్యానేరంలో 'మణి' అనే యువకుడు ఇప్పటికే కోర్టు ద్వారా శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నట్లు రాజా తెలుసుకుంటాడు. స్వయంగా జైలుకు వెళ్లి మణితో మాట్లాడిన రాజాకు, ఈ హత్యల వెనుక అతను లేడని, అసలు హంతకుడు సమాజంలో తిరుగుతున్న ఒక సీరియల్ సైకో కిల్లర్ అయ్యుంటాడని బలమైన అనుమానం కలుగుతుంది.
సాధారణంగా ఏ ఇన్వెస్టిగేషన్ డ్రామాలోనైనా ఒక ఆఫీసర్ ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నేరస్థుడే అమాయకుడని నమ్మి, అతను బయటకు రావడానికి ఆసక్తి చూపకపోయినా సరే, బాధితులకు న్యాయం చేయాలనే తపనతో కేసును రీ-ఓపెన్ చేయడానికి రాజా ప్రయత్నించడమే ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది. ఎస్పీ అనుమతితో రాజా ఈ కేసు చిక్కుముడులను విప్పడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు? అసలు ఆ ఇద్దరు అమ్మాయిలను చంపిన ఆ సైకో ఎవరు? అనేది తెరపైనే చూడాలి.
6 ప్రధాన పాత్రలు.. క్లైమాక్స్‌లో నెక్స్ట్ లెవెల్ థ్రిల్
ఈ కథ ప్రధానంగా మణి - దివ్య, సుందరేశన్ - వెంబా అనే రెండు ప్రేమజంటలతో పాటు కేసును ఛేదించే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు.. ఇలా మొత్తం 6 ప్రధాన పాత్రల చుట్టూ అత్యంత ఆసక్తికరంగా తిరుగుతుంది. మణి, దివ్యల ప్రేమాయణం దివ్య సోదరుడైన నీలకంఠకు ఇష్టం ఉండదు. మరోవైపు మణి స్నేహితుడు సుందరేశన్ తన చెల్లెలు వెంబాను ఇష్టపడుతున్నాడనే విషయం మణికి తెలియదు. ఈ సంక్లిష్టమైన మానవ సంబంధాలు, అసూయ, కోపం మధ్య ఆ ఇద్దరు అమ్మాయిల హత్యలు ఎలా జరిగాయనే అంశాన్ని దర్శకుడు ఆండ్రూ లూయిస్ అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించారు.
మొత్తం 8 ఎపిసోడ్లలో మొదటి 6 ఎపిసోడ్లు కథను, పాత్రలను నిదానంగా ఎస్టాబ్లిష్ చేస్తూ సాధారణంగా సాగినప్పటికీ, చివరి 2 ఎపిసోడ్లు మాత్రం మిగతా కథ మొత్తాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాయి. చివరి క్షణం వరకు అసలు హంతకుడు ఎవరనేది ఆడియన్స్ ఎలాంటి పరిస్థితుల్లోనూ గెస్ చేయలేకపోవడమే ఈ సిరీస్ సాధించిన పెద్ద విజయం.
సాంకేతిక బలం – నటీనటుల పనితీరు
ఈ సిరీస్‌లో నటించిన ప్రతీ ఒక్కరూ తమ పాత్రల్లో జీవించారు. పోలీస్ ఆఫీసర్‌గా శశికుమార్ సెటిల్డ్ నటనతో ఆకట్టుకోగా, ఎస్పీ పాత్రలో అనఘా అద్భుతమైన నటనతో ఎక్కువ మార్కులు కొట్టేసింది. విలేజ్ నేపధ్యం, ఎంచుకున్న లొకేషన్లు కథకు ప్రాణం పోశాయి. సైమన్ కింగ్ అందించిన రీ-రైకార్డింగ్ (BGM) సస్పెన్స్ సన్నివేశాలను వేరే లెవల్‌కి తీసుకెళ్లింది. "జరిగిన దారుణాన్ని మనం మార్చలేం.. కానీ బాధితులకు సరైన న్యాయం చేయవచ్చు" అనే మంచి సందేశంతో ముగిసే ఈ 'వదంతి 2', సస్పెన్స్ , క్రిమినల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్..