Objection My Lord Review : శ్రీకాంత్ కోర్టులో గెలిచాడు.. కానీ సిరీస్ మాత్రం తడబడింది.!
Objection My Lord Review : సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కోర్ట్‌రూమ్ డ్రామా వెబ్‌సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord).
Objection My Lord
Objection My Lord Review : సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కోర్ట్‌రూమ్ డ్రామా వెబ్‌సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord). సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో, రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5' (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. ముకేష్ రిషి, అనన్య శర్మ, స్నేహల్ కామత్ కీలక పాత్రలు పోషించిన ఈ ఏడు ఎపిసోడ్ల థ్రిల్లర్ సిరీస్ ఆరంభంలో ఆసక్తి రేకెత్తించినప్పటికీ, ముగింపు నాటికి సగటు డ్రామాగా మిగిలిపోయింది.
ఓ నోటరీ లాయర్ పోరాటం
పరశురామ్ ఒకప్పుడు ఎంతో తెలివైన లాయర్. కానీ గతంలో ఒక కేసులో ఎదురైన ఘోర పరాజయం వల్ల మళ్లీ కోర్టు మెట్లు తొక్కకూడదని నిశ్చయించుకుని, నోటరీ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల మధ్య కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అతన్ని, కన్న కొడుకే 'ఫెయిల్యూర్ లాయర్' అని అవమానించే పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో నారాయణ అనే వ్యక్తి తన కూతురు సమీరా కిడ్నాప్‌కు గురైందని, ఆమెను కాపాడాలని పోలీసులను, లాయర్లను ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోకపోవడంతో కోర్టు ముందే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ దారుణ సంఘటనతో కదిలిపోయిన పరశురామ్ ఎలాగైనా ఆ ఆత్మహత్య వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసి, కోర్టులో కేసు వాదించాలని నిర్ణయించుకుంటాడు. అతనికి ప్రత్యర్థిగా నగరంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, పవర్‌ఫుల్ లాయర్ విశ్వనాథ్ నిలబడతాడు. అసలు సమీరా నిజంగానే కిడ్నాప్ అయిందా, ఈ కేసుకు ఒక ప్రాంతీయ ఎమ్మెల్యే కొడుక్కి ఉన్న సంబంధం ఏమిటి, లాయర్ వృత్తికి పరశురామ్ దూరమవ్వడానికి ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి అనే విషయాలను ఛేదించి, విశ్వనాథ్‌ను ఓడించి పరశురామ్ ఎలా న్యాయం గెలిపించాడనేదే ఈ సిరీస్ కథాంశం.
ఆరంభం అదరగొట్టి చివరికి తేలిపోయిన కథనం
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రమోషన్లు జరుపుకోవడం, శ్రీకాంత్ , ముకేష్ రిషి లాంటి సీనియర్ నటుల కాంబినేషన్ కావడంతో ఈ సిరీస్‌పై ఓటీటీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కోర్టు ముందే ఒక తండ్రి ఆత్మహత్య చేసుకోవడం, ఆపై నారాయణ అడ్రస్ రివీల్ అయ్యే అనూహ్యమైన ట్విస్ట్‌తో సిరీస్ ఆరంభం ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే, ఎపిసోడ్లు గడిచే కొద్దీ ఆ ఉత్సాహం క్రమంగా సన్నగిల్లుతుంది. సాధారణంగా కోర్ట్‌రూమ్ డ్రామాలు అనగానే లాయర్ల మధ్య సాగే పదునైన సవాళ్లు, ఎత్తులకు పైఎత్తులు, ఊహించని మలుపులు ప్రధాన బలంగా నిలుస్తాయి. కానీ, ఇందులో అలాంటి కిక్ ఇచ్చే ఘట్టాలు పూర్తిగా లోపించాయి. కథలో చిక్కుముడులు విప్పుతూ వెళ్తున్న కొద్దీ ఆసక్తి పెరగడానికి బదులు తగ్గుతూ వస్తుంది. పరశురామ్ , అతని అసిస్టెంట్ వేదా సాగించే విచారణ ఒక దశ దాటాక సాగదీతగా అనిపిస్తుంది. కథలో బలమైన విలన్ పాత్ర లేకపోవడం, ఎమోషనల్ కనెక్టివిటీ తగ్గడం వల్ల దర్శకుడు మొదట్లో సృష్టించిన ఉత్కంఠను చివరి వరకు నిలబెట్టలేకపోయారు.
నటీనటులు & సాంకేతిక వర్గం
నటీనటుల పనితీరు విషయానికి వస్తే, నోటరీ పరశురామ్‌గా శ్రీకాంత్ సెటిల్డ్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్‌తో ఎంతగానో మెప్పించారు. ఒక ఫెయిల్యూర్ లాయర్‌గా, ఆడపిల్లకు జరిగిన అన్యాయంపై పోరాడే వ్యక్తిగా విభిన్న షేడ్స్ చూపిస్తూ ఈ సిరీస్‌ను తన భుజాలపై నడిపించారు. ప్రత్యర్థి లాయర్‌గా ముకేష్ రిషి పాత్రను పవర్‌ఫుల్‌గా పరిచయం చేసినప్పటికీ, ఆయనకు రాసిన సన్నివేశాలు అంత బలంగా లేకపోవడం నిరాశపరుస్తుంది. శ్రీకాంత్ అసిస్టెంట్‌గా అనన్య శర్మ నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించగా, కథకు కీలకమైన సమీరా పాత్రలో స్నేహల్ కామత్ ఎమోషనల్ నటన బాగుంది. అవినీతిపరులైన పోలీసులుగా సమీర్, జెమిని సురేష్ తమ పరిధి మేర నటించారు. సాంకేతిక పరంగా చూస్తే, దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ ఎలాంటి సైడ్ ట్రాక్‌లు లేకుండా కథను నేరుగా నడిపించినా, చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. అరుణ్ చిలువేరు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా టైటిల్స్ సమయంలో వచ్చే మ్యూజిక్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా పర్వాలేదనిపిస్తాయి.
సరికొత్త టైటిల్‌తో వచ్చిన 'అబ్జెక్షన్ మై లార్డ్' ఆరంభంలో ఆకట్టుకున్నా, రొటీన్ కోర్ట్‌రూమ్ ఫార్ములా , బలహీనమైన కథనం వల్ల చివరికి సగటు థ్రిల్లర్‌గా మిగిలిపోతుంది. విచారణ సన్నివేశాల్లో కిక్ మిస్సయినా, సీనియర్ నటుడు శ్రీకాంత్ నటన కోసం ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సిరీస్‌ను ఓసారి డిజిటల్ స్క్రీన్లపై చూడవచ్చు.