Markapuram: వీధి కుక్కల బెడద.. భయం భయంలో పట్టణ ప్రజలు
Markapuram: మార్కాపురం పట్టణంలో రహదారులపై సంచరిస్తున్న ఆవులు, వీధి కుక్కల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Markapuram: వీధి కుక్కల బెడద.. భయం భయంలో పట్టణ ప్రజలు
Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో రహదారులపై ఆవులు, వీధి కుక్కలు స్వైరంగా సంచరిస్తుండటం ప్రజలకు తీవ్ర అసౌకర్యంతో పాటు భయాందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతం, మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిలో పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోంది. వాహనాలు, పాదచారులు, పశువులు ఒకేసారి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమవుతోంది.
రోడ్ల మధ్యలో ఆవులు గుంపులుగా కూర్చోవడం, ఒక్కసారిగా పరిగెత్తడం వంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పీక్ సమయాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.
ఇక వీధి కుక్కల బెడద కూడా రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కుక్కల దాడుల వల్ల పలువురు గాయపడిన ఘటనలు నమోదయ్యాయి. ఇటీవల ప్రధాన రహదారిలో ఆవులు ఒక్కసారిగా పరిగెత్తి ఓ వృద్ధ మహిళను ఢీకొనడంతో ఆమె గాయపడిన సంఘటన ప్రజల్లో భయాందోళన కలిగించింది.
ఈ పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై సంచరిస్తున్న పశువులను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలని కోరుతున్నారు.