Veligonda: వెలిగొండ క్రెడిట్ కోసం చంద్రబాబు తాపత్రయం మాజీ ఎంపీ మేకపాటి
Veligonda: వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం సీఎం చంద్రబాబు తాపత్రయపడుతున్నారు మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి విమర్శ. వైఎస్సార్, జగన్ హయాంలోనే అత్యధిక పనులు జరిగాయని వెల్లడి.
Veligonda: వెలిగొండ క్రెడిట్ కోసం చంద్రబాబు తాపత్రయం మాజీ ఎంపీ మేకపాటి
Veligonda: వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ కోసం తాపత్రయపడుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. 1996లో ఒకసారి, రెండేళ్ల తర్వాత మరోసారి శంకుస్థాపన చేసినా.. అనంతరం ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టు పనులు ప్రారంభమై వేగం పుంజుకున్నాయని.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పనులు అత్యధికంగా జరిగి ప్రాజెక్టు పూర్తికి చేరిందని తెలిపారు. ఆదివారం రాత్రి నెల్లూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్రను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రెండుసార్లు శంకుస్థాపన.. ఫలితం శూన్యం.
చంద్రబాబు 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, రెండేళ్లకే మరోసారి శంకుస్థాపన చేశారని రాజమోహన్‌రెడ్డి తెలిపారు. శంకుస్థాపనల తర్వాత ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు దశాబ్దాల తర్వాత ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు చెప్పుకోవడం సరికాదన్నారు 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి సొరంగాల ద్వారా నీటిని తరలించేలా ప్రాజెక్టును రూపొందించారని వివరించారు. వైఎస్సార్ హయాంలో పనులు శరవేగంగా సాగాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టింది కూడా వైఎస్సారేనని గుర్తుచేశారు.
జగన్ హయాంలో అత్యధిక పనులు.
తదుపరి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కొంతమేర పనులు జరిగినా.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రాజెక్టు పనులు గణనీయంగా ముందుకు సాగాయని రాజమోహన్‌రెడ్డి తెలిపారు. మిషనరీ సమస్యలు ఎదురైనా ప్రత్యామ్నాయ మార్గాల్లో పనులు కొనసాగించి ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా తీసుకెళ్లారని చెప్పారు.
నేనే చేశా’ అంటే చరిత్ర మారదు.
ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరి హయాంలో ఎంత పని జరిగిందన్నది రికార్డుల్లో ఉంటుందని రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే పూర్తయిన ప్రాజెక్టులకు మొత్తం క్రెడిట్‌ను ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవడం వల్ల వాస్తవాలు మారవన్నారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశానని చెప్పుకోవడం వేరు.. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ముందుకు తీసుకెళ్లడం వేరని పేర్కొన్నారు. పోలవరం, వెలిగొండ, సోమశిల హైలెవల్ కెనాల్ వంటి కీలక ప్రాజెక్టులకు వైఎస్సార్ హయాంలోనే పునాది పడిందన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్‌ను 2009లోనే మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
రైతుల పరిస్థితిపై ఆందోళన.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతులు నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు అవసరమైన సహాయం అందించాలని కోరారు.