Markapur: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎస్సీ కమిషన్ సభ్యులు

Markapur: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు. దళితుల సంక్షేమం, అట్రాసిటీ కేసులపై చేపట్టిన చర్యలను వివరించిన గౌతం రాజ్.

Update: 2026-07-30 10:00 GMT

Markapur: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎస్సీ కమిషన్ సభ్యులు

మార్కాపూర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు డాక్టర్ పాకనాటి గౌతం రాజ్ సహచర సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కమిషన్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఈ కాలంలో కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమీక్షలు, పర్యటనల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దళితులు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసులు, దళితులపై దాడులు, సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలు తదితర అంశాలపై కమిషన్ చేపట్టిన చర్యలను సీఎంకు వివరించినట్లు డాక్టర్ పాకనాటి గౌతం రాజ్ తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా, దళితుల హక్కులు పరిరక్షించేలా ఎస్సీ కమిషన్ చురుకుగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

అలాగే షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సంక్షేమం, రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

దళితుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్తో పాటు కమిషన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News