Nellore: నెల్లూరులో టీడీపీ మహానాడు.. 100 ఎకరాల వేదిక కోసం అన్వేషణ!

Nellore: నెల్లూరులో ఈనెల 20 నుంచి 29 వరకు టీడీపీ మహానాడు నిర్వహణకు సన్నాహాలు.

Update: 2026-05-01 14:22 GMT

Nellore: నెల్లూరులో టీడీపీ మహానాడు.. 100 ఎకరాల వేదిక కోసం అన్వేషణ!

Nellore: నెల్లూరు జిల్లాలో ఈనెల 20 నుంచి 29 వరకు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక అన్వేషణ కొనసాగుతోంది.. జిల్లాలోని కోవూరు, నెల్లూరు రూరల్ సర్వేపల్లి నియోజకవర్గం ప్రాథమికంగా వేదిక కోసం జిల్లా నాయకులు పరిశీలన చేస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి,

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్, కావలి, ఉదయగిరి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర,ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ల బృందం కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద సమీపాన కిసాన్ సెజ్ స్థలాన్ని పరిశీలించారు.

మహానాడు కార్యక్రమానికి కనీసం 100 ఎకరాల స్థలం అవసరమైనందున ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మహానాడుకు పెద్ద ఎత్తున నాయకులు ప్రతినిధులు కార్యకర్తలు హాజరవుతున్న నేపథ్యంలో కనీసం 50,000 మంది ప్రతినిధులకు సరిపడా వేదికను సిద్ధం చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్దేశించినట్లు మంత్రి రామనారాయణ రెడ్డి చెప్పారు.

దాదాపు వారం రోజులు పాటు ప్రధాన నేతలు శాసనసభ్యులు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలు ఉండే విధంగా విడిది ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా మహానాడు చివరి రోజు పార్టీ అధినేత, సి ఎం చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత నారా లోకేష్ తో పాటు ప్రధాన ప్రతినిధుల బృందం ప్రాంగణంలోనే స్టే చేసే విధంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాలోని కోవూరు, రూరల్, సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు స్థలాలను అక్కడ పరిస్థితులను అధినేతకు నివేదించిన అనంతరం పార్టీ తుది నిర్ణయం మేరకు వేదికకు ఏర్పాట్లు ప్రారంభిస్తామని రామనారాయణరెడ్డి అన్నారు.

మహానాడు ను ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో జరపాలని పార్టీ భావించినప్పటికీ వైజాగ్ లో గూగుల్ సెంటర్ ఏర్పాటు, శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి హాజరవుతున్నందున రక్షణ, పర్యవేక్షణ పరంగా ఏర్పాట్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, చివరి నిమిషంలో మహానాడును నెల్లూరు లో జరపాలని అధినేత నిర్ణయించినట్లు రామనారాయణ రెడ్డి చెప్పారు.

కోవూరు నియోజకవర్గంలో మహానాడు నిర్వహించినట్లయితే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్ లో పలు పారిశ్రామిక సంస్థలు కొలువు తీరుతునాయని, మహానాడును ఆ ప్రాంగణంలో నిర్వహిస్తే అధినేత చంద్రబాబు నాయుడు ద్వారా మరిన్ని పరిశ్రమలు కొలువుదీరే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. కోవూరు నియోజకవర్గంలో మహానాడు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News