Saidapuram: సైదాపురంలో టీడీపీ అభ్యర్థుల విజయం.. న్యాయమే గెలిచింది!

సైదాపురం: నెల్లూరు జిల్లా సైదాపురం మండల సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా వెంకటగిరి టీడీపీ నాయకుడు కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త రామ్‌కుమార్ రెడ్డి తమపై చేసిన ఆరోపణలను ఖండించారు.

నిన్న వెంకటగిరి నుంచి రౌడీలను తీసుకొచ్చి వైసీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించి, కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు మంచి రాజకీయ సంస్కృతిని నేర్పించారని, తాము ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడామని తెలిపారు. చివరకు న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను గౌరవించాలని, ఓటమిని అంగీకరించకుండా అనవసర ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో సొసైటీ కార్యాలయం ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ రాఘవరెడ్డి, ఎంపీపీ పొట్టేళ్ల పార్వతి, వైస్ ఎంపీపీ సునీత, దిలీప్ చౌదరి, వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి, స్వర్ణ విజయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు చౌదరి, భాస్కర్ నాయుడు, కె.పి. రాజు, మల్లికార్జున రావు, నారాయణ గౌడ్, వెంకటేశ్వర్లు రాజు, రవీంద్ర రాజు, కార్తీక్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: