Nellore: నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌కు ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే శుభాకాంక్షలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (ఇందుకూరుపేట జడ్పీటీసీ సభ్యులు) గారికి, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన పొట్టేళ్ల ప్రసాద్‌ (మనుబోలు జడ్పీటీసీ సభ్యులు) గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంపూర్ణ మద్దతు, జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరగడం ఆనందంగా ఉందన్నారు.

నెల్లూరులోని జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం నూతన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం జడ్పీ ఛైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని, వైస్‌ ఛైర్మన్‌గా పొట్టేళ్ల ప్రసాద్‌ను జడ్పీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కలెక్టర్‌, ప్రిసైడింగ్‌ అధికారి హిమాన్షు శుక్లా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు.. జడ్పీ నూతన ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ప్రశాంతి రెడ్డిగారు కోవూరు జడ్పీటీసీలను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలందరూ ఐక్యంగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఎంత పటిష్టంగా ఉందో జడ్పీ ఛైర్మన్‌ ఏకగ్రీవ ఎన్నిక మరోసారి నిరూపించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మద్దతుతో పాటు జిల్లాలోని కూటమి నాయకుల సమష్టి కృషి ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 జడ్పీటీసీ స్థానాలకు గాను 33 స్థానాలను కూటమి కైవసం చేసుకుందని గుర్తుచేశారు. తన నియోజకవర్గ పరిధిలోని ఇందుకూరుపేట మండలం నుంచి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు జిల్లాలోని ప్రజాప్రతినిధులందరి మద్దతుతో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పేర్కొన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలందరూ సమన్వయంతో పనిచేసి జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి, జిల్లా పరిషత్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కీలకంగా కృషి చేశారని ప్రశంసించారు. ఈ ఐక్యత, సమష్టి కృషిని కొనసాగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తామని స్పష్టం చేశారు.

Tags: