CM Vijay: ‘యాక్టర్ పార్టీ’ అన్నోళ్లకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్.. అసెంబ్లీలో హాట్ కామెంట్స్!

CM Vijay: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రసంగం చేశారు.

Update: 2026-06-23 06:20 GMT

CM Vijay: ‘యాక్టర్ పార్టీ’ అన్నోళ్లకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్.. అసెంబ్లీలో హాట్ కామెంట్స్!

CM Vijay: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మంగళవారం నాటి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హిందీ రుద్దుడు, నీట్‌ (NEET) రద్దు, వారసత్వ రాజకీయాలు, కరూర్‌ తొక్కిసలాట వంటి కీలక అంశాలపై విజయ్ తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శిస్తూ విమర్శకులకు గట్టి బదులిచ్చారు. ఎన్నో కుట్రలు, సవాళ్లను దాటి తాము అధికారంలోకి వచ్చామని ఆయన గుర్తుచేసుకున్నారు.

తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలను సీఎం విజయ్ ఈ సందర్భంగా తిప్పికొట్టారు. ‘‘మాకు ఈ అధికారం అంత సులువుగా రాలేదు. తమిళనాడు ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు నేను, నా పార్టీ ఎన్నో కుట్రలను, సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. మాది ‘యాక్టర్‌ పార్టీ’ అని, నేను సినిమా షూటింగ్‌ నుంచి నేరుగా వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నానని చాలా మంది గేలి చేశారు. కానీ నేను అలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోను. సాధారణంగా చాలా మంది రాజకీయ పార్టీ పెట్టి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్తారు. కానీ, నేను మొదట ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలు తెలుసుకున్న తర్వాతే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశా. నాపై నమ్మకం ఉంచి ప్రజలు నన్ను గెలిపించారు’’ అని విజయ్‌ స్పష్టం చేశారు.

విద్యా వ్యవస్థలో నీట్ (NEET) విధానం తీవ్రమైన అసమానతలను సృష్టిస్తోందని, దీనిని తక్షణమే రద్దు చేయాలని సీఎం విజయ్ డిమాండ్ చేశారు. అలాగే భాషా వివాదంపై మాట్లాడుతూ.. తమిళనాడులో ఎప్పటికీ ద్విభాషా విధానానికే (తమిళం, ఇంగ్లీష్) తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీ భాషను రుద్దేందుకు చేసే ప్రయత్నాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సభ ముఖంగా పునరుద్ఘాటించారు.

ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకున్న కరూర్‌ తొక్కిసలాట దుర్ఘటనను ప్రస్తావిస్తూ సీఎం విజయ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ‘‘ఆ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం నన్ను ఎంతగానో వేధించింది. ఆ బాధ నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. అయితే ఆ విషాద ఘోరం విషయంలోనూ మాపైనే నిందలు వేయడం అత్యంత దారుణం. రాజకీయాలు మరీ ఇంత క్రూరంగా ఉంటాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.

పాలనలో వారసత్వ రాజకీయాల గురించి స్పందిస్తూ అధికార ప్రతిపక్షం డీఎంకే (DMK)పై విజయ్ పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘కేవలం ఒకే ఒక్క కుటుంబానికి ప్రాధాన్యమివ్వడం మా రాజకీయ విధానం కాదు. తమిళనాడులోని ప్రతి కుటుంబాన్ని మా కుటుంబంగా భావించి సేవలు అందిస్తాం. అదే మా రాజకీయం.. అదే మా పాలనా విధానం’’ అని సీఎం విజయ్ తన ప్రసంగాన్ని ముగించారు.

Tags:    

Similar News