DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. స్వయంగా ప్రతిపాదించిన సిద్ధరామయ్య

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ ఎంపిక దాదాపు ఖరారైంది.

Update: 2026-05-28 08:41 GMT

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. స్వయంగా ప్రతిపాదించిన సిద్ధరామయ్య

DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా ముగింపు దశకు చేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఎంపిక ఇక అధికారిక లాంఛనమేనని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య.. తన తదుపరి వారసుడిగా, కొత్త సీఎంగా డీకే శివకుమార్ పేరును స్వయంగా ప్రతిపాదించినట్లు సమాచారం. గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన మంత్రుల బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో సిద్ధూ ఈ కీలక ప్రతిపాదన చేసినట్లు రాష్ట్ర చట్టసభల వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్‌ అధికారికంగా వెల్లడించారు.

నాయకత్వ మార్పు ప్రక్రియలో భాగంగా సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో రాష్ట్ర మంత్రులందరికీ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి హెచ్‌కే పాటిల్‌ మీడియాతో మాట్లాడారు.

"ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ రోజు మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేయనున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో సిద్ధరామయ్య గారే స్వయంగా డీకే పేరును ప్రతిపాదించారు. మంత్రులందరూ దీనికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు" అని మంత్రి స్పష్టం చేశారు.

మరోవైపు సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారికంగా ధృవీకరించింది. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు సిద్ధరామయ్య లోక్‌భవన్‌కు వెళ్లి, అక్కడ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. రాజీనామా ప్రక్రియ ముగిసిన వెంటనే ఆయన తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ నాయకత్వ మార్పు వెనుక ఉన్న కారణాలను ప్రజలకు వివరించనున్నారు.

ఇక కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ శనివారమే (మే 30న) ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో కర్ణాటకలో గత కొద్దిరోజులుగా సాగుతున్న సీఎం పీఠం సస్పెన్స్‌కు తెరపడినట్లయింది.

Tags:    

Similar News