పింఛన్ కోసం వెళ్తే.. ఖాతాలో రూ.759 కోట్లు!

Bihar: బీహార్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. వృద్ధాప్య పింఛన్ కోసం వెళ్లిన ఒక వృద్ధుడి ఖాతాలో ఏకంగా రూ.759 కోట్లు దర్శనమిచ్చాయి.

Update: 2026-07-13 05:20 GMT

పింఛన్ కోసం వెళ్తే.. ఖాతాలో రూ.759 కోట్లు!

Bihar: వృద్ధాప్య పింఛన్‌ (Pension) డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఓ వృద్ధుడికి ఊహించని అనుభవం ఎదురైంది. తన అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ ఎంతో చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఏకంగా రూ.759 కోట్లు ఆయన ఖాతాలో చూపించాయి. అంతటితో ఆగకుండా, ఆయన కుమారుడి ఖాతాలోనూ సరిగ్గా అంతే మొత్తం డబ్బు ఉండడం గమనార్హం. ఈ వింత ఘటన బిహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పుర్‌లో వెలుగుచూసింది.

ముజఫర్‌పుర్‌కు చెందిన 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా ఆదివారం తన వృద్ధాప్య పింఛను డబ్బులు తీసుకోవడానికి స్థానికంగా ఉన్న ‘కామన్ సర్వీస్ సెంటర్’ (CSC)కు వెళ్లారు. డబ్బులు డ్రా చేసుకున్న అనంతరం, తన ఖాతాలో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో చూసి చెప్పాలని అక్కడి సిబ్బందిని కోరారు.

సిబ్బంది కంప్యూటర్‌లో చెక్ చేయగా ఆ వృద్ధుడి ఖాతాలో రూ.759 కోట్ల బ్యాలెన్స్‌ కన్పించింది. దీంతో అనుమానం వచ్చి, దివ్యాంగుడైన అతని కుమారుడి ఖాతాను కూడా పరిశీలించగా, అందులోనూ రూ.759 కోట్లు జమ అయినట్లు చూపించింది. తండ్రీకొడుకులు ఇద్దరి ఖాతాల్లో కలిపి మొత్తంగా రూ.1500 కోట్లకు పైగా నగదు ఉండడంతో సీఎస్‌సీ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

ఈ భారీ మొత్తాన్ని చూసిన వెంటనే సిఎస్‌సి కేంద్ర నిర్వాహకులు పోలీసులకు, బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. బ్యాంకు సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం (Technical Glitch) వల్లే ఈ రెండు ఖాతాల్లోకి ఇంత పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు చూపిస్తూ ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పొరపాటు ఎక్కడ జరిగింది, అసలు కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News