Kerala: పినరయి విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ వాహనాన్ని ధ్వంసం చేసిన సీపీఎం కార్యకర్తలు!
Kerala: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఈడీ (ED) దాడుల వేళ ఉద్రిక్తత నెలకొంది.
Kerala: పినరయి విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ వాహనాన్ని ధ్వంసం చేసిన సీపీఎం కార్యకర్తలు!
Kerala: కేరళ రాజకీయాల్లో బుధవారం నాడు తీవ్ర కలకలం రేగింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) అవినీతి కేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కేరళ అంతటా ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ నివాసాలు సహా మొత్తం 10 ప్రాంతాలలో ఈడీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈడీ దాడులకు నిరసనగా తిరువనంతపురంలోని మాజీ సీఎం పినరయి విజయన్ నివాసం వెలుపల సీపీఎం (CPM) శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు.. సోదాల కోసం వచ్చిన ఈడీ అధికారుల వాహనంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తిరువనంతపురంలోని మాజీ సీఎం విజయన్ అద్దె ఇల్లు, కన్నూర్‌లోని ఆయన స్వగృహంతో పాటు ఈ కేసుకు సంబంధం ఉన్న పలు కార్యాలయాల్లో దాడులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు.. సీఎంఆర్ఎల్ (CMRL) మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కార్త నివాసంలోనూ, కోజికోడ్‌లోని మాజీ మంత్రి మహ్మద్ రియాస్ నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఈడీ దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
"మాజీ సీఎం పినరయి విజయన్‌పై ఈడీ దాడులు చేయడం అనేది.. ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడానికి మరియు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను మరోసారి ఘోరంగా దుర్వినియోగం చేయడమే. ఈ ఈడీ చర్యల వెనుక ఉన్న టైమింగ్ చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ 'చర్యలు లేవు' అని ప్రశ్నించిన వెంటనే దాడులు జరగడం చూస్తుంటే, బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఉన్న రహస్య సంబంధంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి." అంటూ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసాడు.
ఈ కేసు దర్యాప్తును కొనసాగించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇస్తూ కేరళ హైకోర్టు ఇటీవలే కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పీఎంఎల్‌ఏ (PMLA) కింద విచారణ జరపడానికి ముందస్తు ఎఫ్‌ఐఆర్ (FIR) అవసరం లేదని, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) ఇప్పటికే ఫిర్యాదు చేసిందని ఈడీ కోర్టుకు తెలిపింది.
గతంలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) జరిపిన విచారణ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు చెందిన ఒక కంపెనీకి, ఎలాంటి సేవలు అందించకుండానే సీఎంఆర్ఎల్ (CMRL) సంస్థ నుంచి లక్షలాది రూపాయల చెల్లింపులు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. ఆదాయపు పన్ను శాఖ కూడా ఈ లావాదేవీలను వ్యాపార ఖర్చులుగా గుర్తించలేమని గతంలో స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జనవరి 2024 లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎస్‌ఎఫ్‌ఐఓ (SFIO) దర్యాప్తునకు ఆదేశించగా.. తాజాగా హైకోర్టు అనుమతితో ఈడీ తన సోదాలను ముమ్మరం చేసింది.