Abhijit Dipke: మంత్రి ప్రధాన్‌ను దించాం.. రేపు ప్రభుత్వాన్నే కూల్చేస్తాం!

Abhijit Dipke: జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు ఆపాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2026-07-30 05:24 GMT

Abhijit Dipke: మంత్రి ప్రధాన్‌ను దించాం.. రేపు ప్రభుత్వాన్నే కూల్చేస్తాం!

Abhijit Dipke: జంతర్‌ మంతర్‌ వద్ద నెల రోజులకు పైగా సాగిన జాతీయ స్థాయి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడటం తక్షణమే ఆపాలని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులపై పెల్లెట్‌ తుపాకులు ఉపయోగించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే దేశ యువత ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చివేస్తుందని హెచ్చరించారు.

జంతర్ మంతర్ ఆందోళనల అనంతరం బుధవారం తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌కు చేరుకున్న అభిజీత్ దీప్కే, విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు నిరసన తెలిపిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నేరుగా అరెస్టు చేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

‘‘విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు.. వారు ఏమాత్రం ఉగ్రవాదులు కారు. ఇదే రీతిలో వారిని ఇబ్బందులకు గురిచేస్తే ధర్మేంద్ర ప్రధాన్‌లాగే రేపు ఈ ప్రభుత్వాన్ని కూడా యువత మార్చేస్తుంది. ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేసి, ఆయన ప్రావీణ్యానికి తగ్గట్టు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరుగా మారితే బాగుంటుంది. విద్యార్థుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు.. అవసరమైతే అంతకంటే పెద్ద ఎత్తున ఆందోళనను మళ్లీ ప్రారంభిస్తాం’’ అని దీప్కే స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, అభిజీత్ దీప్కే సీజేపీ పార్టీని ప్రారంభించిన కొత్తలో తీవ్ర బెదిరింపులు ఎదుర్కొన్నారని ఆయన తల్లి అనితా దీప్కే గుర్తుచేసుకున్నారు. "బీజేపీలో చేరకపోతే నీ తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు" అంటూ వీడియో రూపంలో బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఆ భయాందోళనల కారణంగానే తాము ఛత్రపతి సంభాజీనగర్‌ను విడిచిపెట్టి, కొంకణ్‌ ప్రాంతంలోని బంధువుల ఇంట పక్షం రోజుల పాటు తలదాచుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.

Tags:    

Similar News