Bengaluru: గవర్నర్ కాన్వాయ్ కోసం 30 నిమిషాల ట్రాఫిక్ జామ్.. సామాన్యుడి తిరుగుబాటు!
Bengaluru: కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ కోసం బెంగళూరు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో ఓ భర్త రోడ్డుపైనే ధర్నాకు దిగాడు.
Bengaluru: గవర్నర్ కాన్వాయ్ కోసం 30 నిమిషాల ట్రాఫిక్ జామ్.. సామాన్యుడి తిరుగుబాటు!
Bengaluru: దేశంలో వీఐపీల (VVIP culture) భద్రత పేరుతో సామాన్య ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయడంపై మరోసారి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ కాన్వాయ్ వెళ్తోందన్న కారణంతో పోలీసులు రోడ్డును బ్లాక్ చేయడంతో.. తీవ్ర అస్వస్థతకు గురైన తన గర్భిణీ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తున్న ఓ భర్త పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే ధర్నాకు దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వీఐపీల సంస్కృతిపై మరియు బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల వైఖరిపై మండిపడుతున్నారు.
కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు మార్గం గుండా వెళ్లాల్సి ఉంది. దీంతో భద్రతా కారణాల రీత్యా అక్కడి పోలీసులు ఆ మార్గంలో దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తి తన గర్భవతి అయిన భార్యకు అత్యవసర చికిత్స అందించడం కోసం ఆసుపత్రికి బైక్‌పై తీసుకువెళ్తున్నాడు. పోలీసులు దారి వదలకపోవడంతో, సమయం దాటిపోతుండటంతో సదరు వ్యక్తికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. వెంటనే వాహనాన్ని పక్కన పెట్టి, గవర్నర్ కాన్వాయ్ వచ్చే ప్రధాన రహదారిపైనే బైఠాయించి నిరసనకు దిగాడు.
రోడ్డుపై ధర్నాకు దిగిన సదరు వ్యక్తి పోలీసులను గట్టిగా నిలదీశాడు. "ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఇప్పటికే అండర్‌పాస్ నిర్మాణ పనుల వల్ల విపరీతమైన రద్దీ ఉంది. ఇలాంటి సమయంలో గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? నా భార్య గర్భవతి.. ఆమెకు అత్యవసరంగా వైద్యం అందించాలి. సామాన్యుల ప్రాణ అత్యవసర పరిస్థితి కంటే మీకు వీఐపీ కాన్వాయ్‌లకే ప్రాధాన్యత ఎక్కువనా?" అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ట్రాఫిక్ క్లియర్ చేసి తన భార్యను ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతించే వరకు తాను రోడ్డుపై నుంచి కదలనని భీష్మించుకోవడంతో.. పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఓ వైపు నుంచి వాహనాలు వెళ్లేందుకు మార్గాన్ని సుగమం చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
"నాయకుల, వీఐపీల సౌకర్యాలకు ఇచ్చే విలువ.. పన్నులు చెల్లించే సామాన్య ప్రజల ప్రాణాలకు లేకుండా పోతోంది" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
అత్యవసర వైద్య సేవలు (ఆంబులెన్స్ లేదా మెడికల్ ఎమర్జెన్సీ) ఉన్నప్పుడు కాన్వాయ్‌లను పక్కన పెట్టి సామాన్యులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గర్భిణీ భార్య కోసం ధైర్యంగా రోడ్డుపైకి వచ్చి ప్రశ్నించిన ఆ భర్తను పలువురు అభినందిస్తున్నారు.