Suryapet: పొలం గట్టు నుంచి బిగ్ వేదికపైకి స్ఫూర్తిప్రదాత్రి ఝాన్సీ!

Suryapet: సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యవసాయం చేసే జానపద గాయని గుండెబోయిన ఝాన్సీ బిగ్ బాస్-10 కి ఎంపిక. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఝాన్సీ కథనం.

Update: 2026-08-18 02:18 GMT

Suryapet: పొలం గట్టు నుంచి బిగ్ వేదికపైకి స్ఫూర్తిప్రదాత్రి ఝాన్సీ!

Suryapet: వ్యవసాయం దండగ అనే భావనతో ఊళ్లు వదిలి పట్నం బాట పడుతున్న యువతకు తన అడుగుజాడలతో ఒక కొత్త దారిని చూపిస్తోంది సూర్యాపేట జిల్లా కోమటికుంటకు చెందిన గుండెబోయిన ఝాన్సీ. మగవారే సాగు పనులకు దూరమవుతున్న ప్రస్తుత రోజుల్లో, ‘మేము సైతం’ అంటూ నాగలి పట్టి, ట్రాక్టర్ నడుపుతూ కన్నవారికి కొండంత అండగా నిలుస్తోంది ఈ జానపద గాయని.

కన్నతల్లి లాంటిది ఎవుసం

తమ తల్లిదండ్రులకు శ్రమ తగ్గించాలని 9వ తరగతిలోనే నాగలి దున్నడం నేర్చుకున్న ఝాన్సీ, ఆపై ట్రాక్టర్ నడపడంలోనూ ఆరితేరింది. ఒకవైపు పొలం పనులు చేస్తూనే ‘ఆర్గానిక్ కెమిస్ట్రీ’లో పీజీ పూర్తి చేసి, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సాధనకు సిద్ధమవుతోంది. "వ్యవసాయం కన్నతల్లి లాంటిది... రిస్క్ ఉన్నా మట్టిని నమ్ముకోవడం మన బాధ్యత" అని బలంగా నమ్మే ఈమె, తన సాగు పనులను పాటల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

జానపదాల ఘుమఘుమలు – సోషల్ మీడియాలో క్రేజ్

"బురద నుంచి బువ్వను తీస్తే కమ్మగుందని తిన్నరు.. బురద దుస్తుల రైతును చూస్తే దూరంగా ఉండని అన్నరు" వంటి గుండెలను పిండే పాటలతో పల్లె జీవితాన్ని, రైతు వ్యయప్రయాసలను వినిపిస్తోంది. దాదాపు 8 లక్షల మందికి పైగా ఫాలోవర్లతో నెటిజన్ల మనసులు గెలుచుకున్న ఝాన్సీ, బుల్లితెరపై 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి ప్రదర్శనల ద్వారా కూడా పాపులర్ అయింది.

అగ్నిపరీక్ష’ నెగ్గి బిగ్ బాస్-10 కి ఎంపిక

సమాజంలో ఆడపిల్ల పట్ల ఉన్న వివక్షను చెరిపేస్తూ.. "కన్నవారి కంటనీరు రాకుండా ఆడపిల్లలమూ చూసుకోగలము" అంటూ ‘బిగ్ బాస్-10 అగ్నిపరీక్ష సీజన్-2’ ఆడిషన్స్‌లో జడ్జిల మనసులను దోచుకుంది. ఈ పరీక్షల్లో ఇన్విజిలేటర్‌గా ఉన్న నవదీప్ ఈమె ఆత్మవిశ్వాసానికి, కష్టపడే తత్వానికి ఇంప్రెస్ అయి అక్కడికక్కడే ఝాన్సీ సోషల్ మీడియా ఖాతాను ఫాలో చేయడం ఆమె ప్రతిభకు నిదర్శనం.

సమాజానికి సందేశం

నిజమైన ప్రతిభకే పట్టం

ఒకప్పుడు కేవలం పబ్లిసిటీ డ్రామాలు ఆడే క్యారెక్టర్లకు మాత్రమే పరిమితమయ్యే వేదికలపైకి, ఝాన్సీ వంటి నిజమైన ప్రతిభ, స్వచ్ఛమైన భావాలు కలిగిన ‘కామనర్’ రావడం సమాజానికి మంచి పరిణామం. ప్రచారం కోసం కాకుండా, పదిమందికి స్ఫూర్తినిచ్చేందుకు కష్టపడే ఇలాంటి వారిని ప్రోత్సహించినప్పుడే నిజమైన శ్రమకు గౌరవం దక్కుతుంది.

తన గళంతో, చేతల ద్వారా గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఝాన్సీ, బిగ్ బాస్ వేదిక ద్వారా కోట్ల మంది ప్రజలకు మట్టి వాసనను, పల్లె సిరిని వినిపిస్తుందని ఆశిద్దాం.

Tags:    

Similar News