Suryapet: కల్యాణలక్ష్మి ఎగ్గొట్టే కుట్ర బొల్లం మల్లయ్య యాదవ్
Suryapet: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎగ్గొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపణ.
Suryapet: కల్యాణలక్ష్మి ఎగ్గొట్టే కుట్ర బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట: రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు.
సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ వద్ద మహిళలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్‌కు వినతిపత్రం అందజేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడేందుకు కుట్ర చేస్తోందని బొల్లం మల్లయ్య ఆరోపించారు. కోర్టులో విచారణకు ఇంకా నాలుగు వారాల గడువు ఉన్నా, ప్రభుత్వం తరఫున న్యాయవాదిని కూడా పంపకుండా పరోక్షంగా స్టే వచ్చేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనితో పథకాన్ని ఎగ్గొట్టాలని చూస్తున్నారని అన్నారు.
కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వకుండా, ఇప్పుడు ఉన్న పథకానికే ఎసరు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా రైతుబంధు, రుణమాఫీ, మహాలక్ష్మి, వృద్ధాప్య పింఛన్ల పెంపు వంటి హామీల అమలులోనూ కాంగ్రెస్ ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు.
తక్షణమే శాసనసభ సమావేశాల్లో ఆర్డినెన్స్ లేదా ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించి కొనసాగించాలని కోరారు.
పాత పథకాలను కొనసాగించకపోతే బిఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని, ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.