Suryapet: సూర్యాపేటలో ఆదర్శ రైతు పొలాన్ని పరిశీలించిన కలెక్టర్
Suryapet: సూర్యాపేట జిల్లాలో రెండు ఎకరాల్లో ఆరు రకాల పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచిన రైతు పాశం వెంకటరెడ్డిని అభినందించిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
Suryapet: సూర్యాపేటలో ఆదర్శ రైతు పొలాన్ని పరిశీలించిన కలెక్టర్
సూర్యాపేట: ఒకే పంటపై ఆధారపడకుండా రెండు ఎకరాల్లో ఆరు రకాల పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచిన స్థానిక రైతు పాశం వెంకటరెడ్డిని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం కలెక్టర్ వెంకటరెడ్డి పొలాన్ని పరిశీలించారు. పొలంలో సాగు చేస్తున్న బీర, మిర్చి, బెండకాయ, వంకాయ, సొర, బంతిపూల సాగు వివరాలను, అనుసరిస్తున్న పద్ధతులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తనకున్న రెండు ఎకరాల్లో ఒకే రకం పంట వేయకుండా విభిన్న పంటలు వేస్తున్నట్లు తెలిపారు. 30 గుంటల్లో వేసిన మిర్చి ద్వారా దాదాపు 10 టన్నులు, బీర ద్వారా 4 టన్నులు, బంతి పూల ద్వారా టన్నున్నర నుంచి 2 టన్నులు, బెండ, దోస సాగు ద్వారా మరో టన్ను వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఒకే పంటతో నష్టపోకుండా ఇలా రకరకాల పంటలు వేయడం వల్ల ఏడాది పొడవునా నిరంతర ఆదాయం వస్తుందని చెప్పారు. రైతు సాగు పద్ధతులను కలెక్టర్ ప్రశంసించారు.
అనంతరం కలెక్టర్ శ్రీనివాస్‌పురం గ్రామానికి చెందిన పారుపల్లి శ్రీనివాసరావు (శ్రీ శ్రీ) ఐదు ఎకరాల డ్రాగన్ తోటను సందర్శించారు. సంపూర్ణ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న తీరును పరిశీలించి, పంట దిగుబడి, అంతర్గత పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతర్గత పంటలు వేయడం, గట్ల వెంట వివిధ రకాల చెట్లు నాటడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని రైతుకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఏడి ఏ రవి, ఎంఏఓ స్వర్ణ, తహసిల్దార్ కవిత, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.