Suryapet: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఏఐసీసీ నేత సర్వోత్తమ్ రెడ్డి ధ్వజం
Suryapet: సూర్యాపేట 2వ వార్డులో రూ.5 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నివేదిత.
Suryapet: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఏఐసీసీ నేత సర్వోత్తమ్ రెడ్డి ధ్వజం
సూర్యాపేట: ప్రజల సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే ఉండి ఏం లాభమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రశ్నించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 2వ వార్డులో కౌన్సిలర్ బానోతు సైదులు నాయక్ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైప్ లైన్ పనులకు వారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే ఉన్నా లేనట్టేనని విమర్శించారు. సూర్యాపేట పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ నీటి వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడటం వల్ల మోటార్లు, యంత్రాల్లో సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు వస్తున్నాయని, ఒకే వనరుపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేయాలని అన్నారు.
దోసపహాడ్ నుంచి 13 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్ ఉన్నా అవసరమైన స్థాయిలో నీటి లభ్యత లేదని, పాలేరు నుంచి నీటిని తీసుకురావడంతో పాటు ఇమాంపేట సమీపంలోని మిషన్ భగీరథ మార్గం ద్వారా మరో పైప్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మూసీ నుంచి నీటిని తీసుకునేందుకు గతంలో ఉన్న 10 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల పాత ఫిల్టర్ ప్లాంట్ ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటీవల ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులు సూర్యాపేటకు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ నీటి వనరులు, 200 బార్ పైప్ లైన్, పాలేరు నీటి వనరులను చూపించినట్లు తెలిపారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని, ఇది భారీ బడ్జెట్ తో కూడుకున్న అంశమని, వెంటనే పూర్తి పరిష్కారం చూపుతామని చెప్పలేమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆశీస్సులతో సూర్యాపేట మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడే తిరిగి ఓట్లు అడిగే హక్కు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వల్ప తేడాతో ఓటమి చెందినా ప్రజల సమస్యల పరిష్కారంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ నుంచి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని, ముందుగా ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, చివ్వేంల మండల అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చింతమళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.