Suryapet: బండరామారంలో కలెక్టర్ కొరడా హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు సస్పెండ్
Suryapet: జెడ్పీహెచ్ఎస్ లో విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు, జీరో ఎన్‌రోల్‌మెంట్‌కు కారణమైన హెడ్‌మాస్టర్‌తో పాటు నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
Suryapet: బండరామారంలో కలెక్టర్ కొరడా హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు సస్పెండ్
సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, కొందరు ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యం ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతోంది. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గానూ బండరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) హెడ్‌మాస్టర్‌తో పాటు నలుగురు ఉపాధ్యాయులను జిల్లా యంత్రాంగం సస్పెండ్ చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
జీరో ఎన్‌రోల్‌మెంట్‌పై కలెక్టర్, DEO సీరియస్,ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా నమోదు కాకపోవడం (జీరో ఎన్‌రోల్‌మెంట్) పై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరపగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపేలా ఈ ఉపాధ్యాయులే వెనకుండి నడిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా, పాఠశాల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వీరు తప్పుడు ప్రచారం చేసినట్లు విచారణలో ప్రాథమికంగా నిరూపితమైంది.
సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం, అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో పాటు పాఠశాల రికార్డుల నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులు సమయానుకూలంగా జారీ చేసిన ఆదేశాలను, నిబంధనలను వీరు పూర్తిగా బేఖాతరు చేసినట్లు తేలింది.
"విద్యార్థుల భవిష్యత్తుతో రాజీపడబోం" ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే మా ప్రధాన లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేలా ప్రవర్తించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బండరామారం ఘటనపై ప్రస్తుతం పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. బాధ్యులపై తదుపరి కఠిన చర్యలు ఉంటాయి.
జిల్లా కలెక్టర్ ఈ సస్పెన్షన్ వేటుతోనైనా ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా ఊపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.