Music: రెహమాన్ అంటే చెవులు కోసుకున్నా...ఇళయరాజాను ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
సంగీత ప్రపంచంలో దిగ్గజాలు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్‌లు. ఈ ఇద్దరు సంగీత దర్శకులు వారి వారి శైలిలో సంగీత ప్రయులను ఆకట్టుకున్నారు. నేటికీ వారి సంగీతంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నారు.
Music: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఇద్దరు దిగ్గజాల పేర్లు చెబితే మొదటిగా గుర్తుకువచ్చేవి ఇళయరాజా, ఏఆర్ రెహమాన్. ఒకరు తమ నాదస్వరంతో వేలాది పాటలకు జీవం పోసిన ‘ఇసైజ్ఞాని’ అయితే, మరొకరు భారతీయ సంగీత స్థాయిని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన సంగీత మాంత్రికుడు. రెహమాన్ సంగీతానికి ఫిదా అయ్యే శ్రోతలు కోకొల్లలు అయినప్పటికీ, ఇప్పటికీ మిలియన్ల మంది సంగీతాభిమానులు ఇళయరాజాని గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
సంగీత శైలి ... వెస్ట్రన్ మిక్సింగ్ వర్సెస్ క్లాసికల్ వెరైటీ
ఏఆర్ రెహమాన్ ప్రధానంగా పాశ్చాత్య సంగీత ప్రభావంతో పాటలను స్వరపరుస్తారు. కీబోర్డ్ ప్లేయర్‌గా ఆయనకున్న నైపుణ్యంతో డిజిటల్ మిక్సింగ్, సౌండ్ ఇంజనీరింగ్ అద్భుతంగా ఉంటాయి. అయితే, కొన్నిసార్లు ఈ వాద్యాల శబ్దం గాత్రం కంటే ఎక్కువగా అనిపిస్తుంది. కానీ, ఇళయరాజా సంగీతం అత్యంత వైవిధ్యభరితం. జానపద బాణీలు, కర్ణాటక శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య సింఫనీలను మిళితం చేసి సామాన్యుడి గుండెను తాకేలా బాణీలు కట్టడంలో ఆయన దిట్ట. వెస్ట్రన్ చేయడంలోనూ పట్టు ఉన్నా... సాధ్యమైనంత వరకు సామాన్యులకు చేరేలా సంగీతాన్ని అందించడంలో ఇళయరాజా దిట్ట.
ఇద్దరి మధ్య ప్రస్ఫుటమైన తేడాలు
ఈ ఇద్దరి శైలులను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఇళయరాజా శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య మెలోడీలు ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తాయి. ఇక రెహమాన్ విషయానికి వస్తే ఎక్కువగా డిజిటల్, వెస్ట్రన్, సూఫీ పాప్ శైలి సినిమాల్లో మనకు కనిపిస్తుంది. ఇక ఇళయరాజ సంగీతంలో గాయకుల స్వరం, సాహిత్యం స్పష్టంగా వినిపిస్తుంది. కానీ, రెహమాన్ మ్యూజిక్‌లో సౌండ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఏ సంగీత దర్శకుడికి అయినా తాను స్వరపరిచిన పాటలకు, సంగీతానికి గుర్తింపు లభిస్తే దానికి రెండింతలు మంచి సంగీతాన్ని అందిస్తారు. ఇళయరాజ సుమారు 7 వేలకు పైగా పాటలను స్వరపరిచి పలు భారతీయ పురస్కారాలు అందుకోగా... రెహమాన్ తన సంగీతాన్ని విశ్వవాప్తం చేసి రెండు ఆస్కార్ అవార్డులు, గ్రామీ అవార్డులు అందుకున్నారు.
మౌనంలోనూ సంగీతం ...సాగర సంగమం ఉదాహరణ
సంగీతం అంటే కేవలం శబ్దం మాత్రమే కాదు, శబ్దానికి-నిశ్శబ్దానికి మధ్య ఉండే పవిత్రమైన బంధం. ఇందుకు నిదర్శనం 'సాగర సంగమం' చిత్రంలోని మౌనమేలనోయి పాట. రాత్రి వేళ కథానాయక-కథానాయకుల మధ్య ఉండే సందిగ్ధత, మౌనాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. అనవసరమైన డ్రమ్స్, వాయిద్యాల గోల లేకుండా మధ్యమధ్యలో వచ్చే నిశ్శబ్దాన్ని కూడా ఒక వాయిద్యంలా వాడటం ఇళయరాజాకే చెల్లింది. రాత్రి వేళ ఒంటరిగా ఈ పాట వింటుంటే మనసు పరవశించిపోతుంది. అందుకే, రెహమాన్ ట్రెండీ మ్యూజిక్‌ను ఎంతగా ఆస్వాదించినా.. ఆత్మను స్పర్శించే మెలోడీల కోసం ప్రతి ఒక్కరూ ఇళయరాజా పాటల వైపే మొగ్గుచూపుతారు.