Insurance: అభిమానులకు ఇన్సూరెన్స్ చేయించిన ఏకైక తెలుగు హీరో నువ్వే అన్న

Insurance: హైదరాబాద్‌లో జరిగిన AAFA సమ్మిట్ 2026లో అభిమానుల కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.

Update: 2026-07-29 03:05 GMT

Insurance: అభిమానులకు ఇన్సూరెన్స్ చేయించిన ఏకైక తెలుగు హీరో నువ్వే అన్న

Allu Arjun: టాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరైన అల్లు అర్జున్.. ‘పుష్ప’ ప్రభంజనంతో పాన్ ఇండియా స్థాయిలో ‘ఐకాన్ స్టార్’గా వెలుగుగొందుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాకు అభిమానులు మాత్రమే కాదు.. ఒక సైన్యం ఉంది అని బన్నీ ఎప్పుడూ గర్వంగా చెబుతుంటారు. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ తన అభిమానుల పట్ల ఉన్న అమితమైన ప్రేమానురాగాలను చాటుకుంటూ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు.

అల్లు అర్జున్ అభిమానులు నెలకొల్పిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ వేదికగా AAFA Annual Summit 2026 పేరిట భారీ ఫ్యాన్స్ మీట్ జరిగింది. ఈ సమ్మిట్‌కు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాల నుంచి దాదాపు 1000 మంది అభిమానులు తరలివచ్చారు.

కార్యక్రమానికి విచ్చేసిన బన్నీ.. అభిమానులను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. సుదీర్ఘంగా ఆరు గంటల పాటు నిలబడి ప్రతీ ఒక్కరితో పర్సనల్‌గా మాట్లాడారు. వేల కిలోమీటర్ల నుంచి వచ్చిన ప్రతి అభిమానితో ఓపికగా ఫొటోలు దిగారు. అభిమానుల కోసం ప్రత్యేకంగా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయించడమే కాకుండా, వారు ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని అందించారు.

ఈ మీట్‌లో అల్లు అర్జున్ తీసుకున్న సంచలన నిర్ణయం అందరి హృదయాలను గెలుచుకుంది. సినిమాలు విడుదలైన సమయంలో థియేటర్ల దగ్గర కటౌట్లు కట్టడం, రచ్చ చేయడం చేసే అభిమానుల భద్రత, వారి కుటుంబాల భవిష్యత్తు ఎంతో ముఖ్యమని బన్నీ భావించారు. ఈ క్రమంలోనే విచ్చేసిన అభిమానులకు ఉచితంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించి, కార్డ్స్ అందించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా, జిల్లా కమిటీ సభ్యులకు రూ.3 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు

అభిమానుల భద్రత కోసం ప్రమాద బీమా చేయించిన అల్లు అర్జున్ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రముఖులు బన్నీని ఆకాశానికెత్తుతున్నారు. అభిమానాన్ని వాడుకోవడం కాదు.. వారి కుటుంబాలకు అండగా నిలవడమే నిజమైన హీరో అని అభిమానులు కొనియాడుతున్నారు. కేవలం రీల్ హీరోగానే కాదు, తన ఆర్మీ బాధ్యత భుజానెత్తుకుని రియల్ హీరో అనిపించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.


 



Tags:    

Similar News