Chittoor Nagaiah life story: సుఖాంతంకాని సినిమా కథలు - దానం చేసిన చేతులు ఆకలితో అలమటిస్తే

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ విజయం ఎంత వేగంగా వస్తుందో, అపజయం అంతకంటే వేగంగా పలకరిస్తుంది. విజయం సాధించినవారినే ఈ రంగం గుర్తుపెట్టుకుంటుంది.

Update: 2026-05-10 09:10 GMT

Chittoor Nagaiah life story: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ విజయం ఎంత వేగంగా వస్తుందో, అపజయం అంతకంటే వేగంగా పలకరిస్తుంది. విజయం సాధించినవారినే ఈ రంగం గుర్తుపెట్టుకుంటుంది. విషాధంగా ముగిసిన తారల కథలను గుణపాఠాలుగా నెమరవేసుకుంటుంది. అలాంటి వారిలో ఒకరు చిత్తూరు నాగయ్య. తెలుగు సినీ చరిత్రలో చిత్తూరు నాగయ్య పేరు ఒక ప్రత్యేక అధ్యాయం. నటుడిగా మాత్రమే కాదు, మనసున్న మహానుభావుడిగా కూడా ఆయనను గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని తన నటనతో మంత్ర ముగ్ధులను చేసిన నాగయ్య.. చివరి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు మాత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. సంపాదనను గడ్డిపోచలా భావించి, దాతృత్వంలో 'త్యాగయ్య' అనిపించుకున్న ఆయన జీవితం నేటి తరానికి ఒక గుణపాఠం.

అప్పట్లోనే లక్షల పారితోషికం...కానీ

ఇప్పుడంటే ఎంతో మంది స్టార్‌ హీరోలున్నారు. కానీ, 1940-50 దశకంలో స్టార్‌ హీరో అంటే గుర్తుకు వచ్చేది నాగయ్యే. ఆ కాలంలో ఆయన ఒక్కరే స్టార్‌ హీరో. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి నటులు హీరోగా ఎదుగుతున్న రోజులు అవి. అంతేకాదు, హిట్‌ చిత్రాల్లో నటించినా ఈ హీరోలకు వచ్చే సంపాదన సినిమాకు 5 నుంచి 10 వేలు మాత్రమే. కానీ, నాగయ్య ఓ సినిమాలో నటిస్తే సుమారు లక్ష నుంచి రెండు లక్షల వరకు తీసుకునేవారు. అప్పట్లో ఒక సినిమా తీయడానికే రెండు నుంచి మూడు లక్షలు ఖర్చయ్యేవి. ఒక్క నటుడికే అంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారంటే ఆయన స్టామినా ఏపాటిదో అర్థమయ్యే ఉంటుంది. వచ్చిన సంపాదనను బ్యాంకులో వెనకేసుకోకుండా చేతికి అందినకాడికి దానం చేశాడు. స్టూడియోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ కులమతాల పట్టింపు లేకుండా భోజనం పెట్టించేవాడు. విద్యార్థులకు ఫీజులు, పేద కళాకారులకు ఆర్థిక సాయం చేశారు. ఇలా దానధర్మాలు చేయడంతో సంపాదించిన ఆస్తి హారతికర్పూలంగా కరిగిపోయింది.

మనోవేదన మిగిల్చిన 'పిట్టల దొర' వేషం

ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎందరు ఎలా మారిపోయినా కాలచక్రం ఆగదు. కాల చక్రంతో పాటు మనమూ పరిగెడితే స్థిమితంగా ఉంటాం. కానీ, తనకుమాలిన ధర్మం చేస్తే ఆర్థికంగా చితికిపోతాం. వచ్చిన దాన్ని దాచుకోకుండా, భవిష్యత్‌ అవసరాలను గుర్తించకుండా దానం చేయడం వలన...చివరి రోజుల్లో బతకడానికి చిన్న చిన్న వేషాలు వేయాల్సి వచ్చింది. ఒకప్పుడు సినిమా రంగాన్ని శాసించిన నాగయ్య... ఆకలి తీర్చుకోవడం కోసం గంటల తరబడి వేషాల కోసం నిలబడిన రోజులు వచ్చాయంటే ఆశ్చర్యం. ఒక రోజు వాహిని స్టూడియోలో 'పిట్టల దొర' వేషం వేసి తన షాట్ కోసం ఎదురుచూస్తున్నారు. గంటల తరబడి ఆకలితో అలమటిస్తున్న ఆ మహానటుడిని చూసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, "ఈ రోజు షాట్ లేదు, వెళ్లిపోండి" అని అగౌరవంగా మాట్లాడటం నాగయ్య గారిని కృంగదీసింది. ఈ దృశ్యాన్ని చూసిన శోభన్ బాబు చలించిపోయి, డైరెక్టర్‌తో గొడవపడి మరీ ఆ షాట్ పూర్తి చేయించి, నాగయ్య గారి పాదాలకు నమస్కరించారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా...మహానటుడికి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి తీరాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది.

నేటి తరానికి నేర్పే పాఠం

చిత్తూరు నాగయ్య గారి జీవితం మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది. సంపాదించడం ఎంత ముఖ్యమో, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. దాతృత్వం గొప్పదే, కానీ అది మనల్ని రోడ్డున పడేసేలా ఉండకూడదు. సినిమా కథలు సుఖాంతం అవుతాయేమో కానీ, నిజ జీవితంలో పొరపాట్లు చేస్తే చివరన మిగిలేది కన్నీళ్లే. అందరికీ అన్నం పెట్టిన ఆ చేతులు ఆకలితో ముగియడం వెండితెర వెనుక ఉన్న చీకటి కోణం. ఆయనను ఆదర్శంగా తీసుకుందాం.. కానీ ఆయన అనుభవించిన ఆర్థిక ఇబ్బందుల నుంచి పాఠాలు నేర్చుకుందాం. ప్రతీ కథలో మలుపులు ఉన్నట్టుగానే చీకటి కోణాలు కూడా ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఏది మంచో దానిని మాత్రమే మనం స్వీకరించాలి.  

Tags:    

Similar News