Sahasam Movie: సాహసం నిజంగా ఓ సాహసమే...ఎన్నిసార్లైనా ఎందుకు చూడాలనిపిస్తుందో తెలుసా?

గోపీచంద్ నటించిన 2013 సాహసం సినిమా ఇప్పటికీ ఎందుకు ప్రత్యేకం? చంద్రశేఖర్ యేలేటి మేకింగ్, ట్రెజర్ హంట్ కథ, హింగ్లాజ్ మాతా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సాహసగాథే.

Update: 2026-08-19 05:52 GMT

Sahasam Movie: తెలుగు సినిమాలో రొటీన్ ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీలు వందల సంఖ్యలో వస్తుంటాయి. కానీ, ఒక ట్రెజర్ హంట్, అడ్వెంచరస్ థ్రిల్లర్ జానర్ దాకా వచ్చేసరికి వేళ్లమీద లెక్కపెట్టే చిత్రాలు మాత్రమే గుర్తుకొస్తాయి. 90ల నాటి క్లాసిక్స్ తర్వాత ఆ తరహా సాహస కథలను టచ్ చేయడానికి ఎవరూ ధైర్యం చేయని సమయంలో, 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన చిత్రం ‘సాహసం’. మైండ్ బ్లాకింగ్ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రయోగాలను, భిన్నమైన సినిమాలను ఇష్టపడే ఏ సినిమా ప్రేమికుడికైనా మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఒక విజువల్ వండర్.

కథలోని అసలు కిక్ ... దిగువ మధ్యతరగతి డ్రీమ్

ఒక సామాన్య సెకండ్ హ్యాండ్ బైక్ రికవరీ ఏజెంట్, ఎప్పటికైనా బాగా ధనవంతుడు కావాలని కలలు కనడం ఈ కథలోని ప్రధాన ముఖ్యాంశం. అయితే, తన తాత ముత్తాతల నాటి భారీ వారసత్వ సంపద పాకిస్తాన్‌లో ఉందనే నిజం తెలిసినప్పుడు హీరో తీసుకునే నిర్ణయమే అసలైన 'సాహసం'. దేశ విభజన నాటి చారిత్రక అంశాలను చూచాయగా తాకుతూ కథను నడిపించిన తీరు అత్యంత సహజంగా ఉంటుంది.

నిజమైన పాకిస్తాన్ వాతావరణం ... నటీనటుల ప్రదర్శన

ఈ చిత్రంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ చంద్రశేఖర్ ఏలేటి మేకింగ్. కథను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నేపథ్యంలో చాలా వాస్తవికంగా ఆవిష్కరించారు. అక్కడి వీధులు, పఠాన్ సాంప్రదాయాలు, కిరాతక తీవ్రవాద ముఠాలు... ప్రతీది ఎంత నాచురల్‌గా చూపించారంటే, సినిమా మొత్తాన్ని నిజంగానే పాకిస్తాన్‌లో చిత్రీకరించారేమో అనే అనుభూతి కలుగుతుంది. హీరోగా గోపీచంద్ కనబరిచిన నటన, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే విలన్‌గా బాలీవుడ్ నటుడు శక్తికపూర్ చూపించిన నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. హాలీవుడ్ ట్రెజర్ హంట్ సినిమాల ఛాయలు కనిపించినప్పటికీ, మన కథనం, నేటివిటీ వల్ల అది ఏమాత్రం కాపీలా అనిపించదు.

హింగ్లాజ్ మాతా ఆలయ ప్రాశస్త్యం

ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, చారిత్రక పాయింట్ 'హింగ్లాజ్ మాతా దేవాలయం'. సనాతన ధర్మంలో ప్రసిద్ధి చెందిన 52 దివ్య శక్తిపీఠాలలో ఒకటైన ఈ క్షేత్రం ఇప్పటికీ పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రోవిన్స్ లో గల 'హింగుల్ నేషనల్ పార్క్' లో ఒక ప్రాచీన రాతి గుహలో ఉంది. అక్కడ అమ్మవారికి నిత్య పూజలు జరుగుతుంటాయి. ఈ శక్తిపీఠం చుట్టూ అల్లుకున్న నిధి అన్వేషణ, గుహలోని చిక్కుముడులను విప్పే పజిల్ సీన్స్ ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి. మామూలు కమర్షియల్ హంగులకు దూరంగా, కథలోని సహజత్వాన్ని కాపాడుతూ తీసిన 'సాహసం' టాలీవుడ్‌లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అరుదైన సాహస గాథ. 

Tags:    

Similar News