Pawan Kalyan Emotional Post : ‘కోట్ల మందికి మెగాస్టార్.. నాకు మాత్రం ఒకే ఒక్క హీరో..

Pawan Kalyan Emotional Post : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న

Update: 2026-08-22 07:04 GMT

Pawan Kalyan, Chiranjeevi

Pawan Kalyan Emotional Post : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక సుదీర్ఘమైన, అత్యంత భావోద్వేగపూరితమైన సందేశం అభిమానుల హృదయాలను తాకుతోంది. "అన్నయ్య గురించి ఆలోచించడం ఎప్పుడూ నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది" అంటూ ప్రారంభమైన ఈ పోస్ట్‌లో పవన్ తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగిన తీరు వరకు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఎంతో ప్రేమగా నెమరువేసుకున్నారు.

చిన్ననాటి సంబరం నుంచి 'సూపర్ హీరో' ఆరాధన వరకు

చిరంజీవి నర్సాపూర్‌లో కళాశాల విద్యను అభ్యసిస్తున్న రోజుల్లో, వేసవి సెలవులకు ఇంటికి రావడం తమకు ఒక పెద్ద పండుగలా ఉండేదని పవన్ గుర్తుచేసుకున్నారు. సెలవులు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేటప్పుడు ఇంట్లో పెద్ద శూన్యత ఏర్పడేదని, ఆయన లేని ఇల్లు కలకలలాడేది కాదని తెలిపారు.

తన పాఠశాల రోజుల్లో అన్నయ్యతో కలసి నడవడం తనకు ఎంతో గర్వకారణంగా ఉండేదని, అప్పటికి చిరంజీవి ఇంకా కాలేజీలోనే ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తితో నడుస్తున్న భావన కలిగేదని చెప్పారు. తన తండ్రి బుల్లెట్ 350 సీసీ బైక్‌పై రింగుల జుట్టు, బెల్ బాటమ్స్, కళ్లజోడు ధరించి ఎన్‌సీసీ క్యాడెట్ రూపంలో చిరంజీవి వెళ్తుంటే.. ఒక హీరోని ఆరాధించే అభిమానిలా చూసేవాడినని, వెండితెరపై హీరో కాకముందే తన అన్నయ్య తనకు రియల్ హీరో అని పవన్ పేర్కొన్నారు.

మొదటి సింగపూర్ ట్రిప్ గిఫ్టులు.. పెళ్లి నాటి కన్నీళ్లు

తన తొలి సింగపూర్ పర్యటన నుంచి చిరంజీవి ఒక పెద్ద నీలిరంగు బ్యాగుతో ఇంటికి తిరిగి వచ్చిన క్షణాలు పవన్ మనసులో నిలిచిపోయాయి. ఆ బ్యాగులో తనకు లభించిన మొదటి చిన్న లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ టేపులు, టేప్ రికార్డర్, యార్డ్లీ పౌడర్లు, పెర్ఫ్యూమ్‌లు వంటి కానుకలు తమ చిన్నపాటి ఇంట్లో ఎంతో సంతోషాన్ని నింపాయని తెలిపారు.

తర్వాతి రోజుల్లో అన్నయ్య పెళ్లి చేసుకున్నప్పుడు తమకు దూరం అయిపోతాడేమోనన్న భయంతో ఒక గదిలో కూర్చుని రహస్యంగా ఏడ్చానని పవన్ చెప్పారు. ఆ సమయంలో చిరంజీవి తన వదిన సురేఖను తీసుకువచ్చి "రా, నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాను" అని అన్నారని, పవన్ కన్నీళ్లకు కారణం తెలుసుకుని వారిద్దరూ నవ్వుకున్నారని పంచుకున్నారు.

చెన్నైలో శ్రమకోర్చిన రోజులు.. అన్నయ్య త్యాగంపై అపరాధ భావం

ఆ తర్వాత రోజుల్లో చదువుకోవడానికి చెన్నై (అప్పటి మద్రాస్) వెళ్లినప్పుడు అన్నయ్య, వదిన తనపై కురిపించిన ప్రేమానురాగాలు వర్ణించలేనివని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి పడిన కష్టం, పగలు రాత్రి తేడా లేకుండా చేసిన శ్రమ, షూటింగ్‌లలో అయిన గాయాలను తాను స్వయంగా చూశానని తెలిపారు. చెన్నై వేడి, ఉక్కపోతలో స్వెట్‌షర్ట్‌తో తడిసిన కాస్ట్యూమ్స్, బూట్లతో 18 గంటల కఠినమైన షిఫ్ట్ పూర్తి చేసుకుని, నిలబడటానికి కూడా ఓపిక లేని స్థితిలో అర్ధరాత్రి ఇల్లు చేరేవారని గుర్తుచేసుకున్నారు.

తాను చదువులో విఫలమై, జీవితంలో ఎలాంటి స్పష్టమైన దిశా నిర్దేశం లేకుండా ఉన్నప్పటికీ, చిరంజీవి ఒక్క మాట కూడా అనలేదని, ఆయన రెక్కల కష్టంపై బ్రతుకుతున్నందుకు తనకు అప్పట్లో అపరాధ భావం (Guilt) కలిగేదని పవన్ ఆవేదనగా పంచుకున్నారు.

సౌత్-నార్త్ సినిమాల మధ్య వారధి.. ఆపలేని శ్రమజీవి

చిరంజీవి తన ఉదారతతో కేవలం కుటుంబాన్ని మాత్రమే కాకుండా బంధువులను, స్నేహితులను, నిర్మాతలను, చలనచిత్ర రంగాన్ని వెలిగించారని కొనియాడారు. దక్షిణ భారత , హిందీ చిత్రసీమల మధ్య ఒక సాంస్కృతిక వారధిలా పనిచేసిన ప్రాథమిక వ్యక్తుల్లో ఆయన ముఖ్యుడని, 'ప్రతిబంధ్', 'ఆజ్ కా గూండారాజ్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇండియన్ సినిమా శక్తేంటో నిరూపించారని చెప్పారు.

సాంకేతికతపై అవగాహన, అద్భుతమైన వైద్య పరిజ్ఞానం, సేవా గుణం, సూపర్ స్టాడమ్ నుంచి మెగాస్టార్‌గా ఎదగడం, కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం, జాతీయ అవార్డులు , దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మవిభూషణ్' సాధించడం వరకు సాధించనిది ఏదీ లేకపోయినా ఆయన ఎప్పుడూ విశ్రమించరని పవన్ తెలిపారు. ఇటీవల వెన్నుముకకు పెద్ద ఆపరేషన్ జరిగినప్పటికీ, అతి తక్కువ సమయంలోనే స్ట్రెంత్ ట్రైనింగ్‌తో మళ్లీ కోలుకుని సెట్స్‌పైకి వచ్చారని, ఆయనలో ఆపలేని ఒక మోటార్ ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

అందుకే ఆయన కోట్ల మందికి 'మెగాస్టార్' అయ్యారని, తనకు మాత్రం 'ఒకే ఒక్క హీరో'గా నిలిచారని పవన్ స్పష్టం చేశారు. "నా ప్రియమైన అన్నయ్యకు ప్రకృతి మాత ఆయురారోగ్యాలను, అపారమైన శక్తిని, విజయాలను ప్రసాదించాలి" అని ఆకాంక్షించిన పవన్.. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం కేవలం ఒక సాంప్రదాయం కాదని, భారతావనికి బలమైన పునాదులు వేయడానికి ఆయన జీవితం తనలాంటి ఎంతోమందిపై ఎలాంటి ప్రభావం చూపిందో గుర్తుచేసే ఒక చిన్న ప్రయత్నమని ముగించారు.


Tags:    

Similar News