Oscars 2026: ఆస్కార్ వేడుకల్లో ప్రియాంక చోప్రా మెరుపులు.. విజేతల జాబితా ఇదే..!

Oscars 2026: లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' ఆరు అవార్డులతో సత్తా చాటింది.

Update: 2026-03-16 04:48 GMT

Oscars 2026 (Image curtesy: Reuters)

Oscars 2026: ప్రపంచ సినీ యవనికపై అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఉన్న డాల్బీ థియేటర్‌లో కన్నుల పండువగా జరిగింది. సినిమా రంగానికి నోబెల్ అవార్డుగా పరిగణించే ఈ ఆస్కార్ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ నటీనటులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులు ఒకే వేదికపై మెరిశారు. ఈ ఏడాది భారతీయులకు గర్వకారణంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రజెంటర్‌గా వ్యవహరించడం విశేషం.

ఈ ఏడాది ఆస్కార్ రేసులో పలు అద్భుతమైన చిత్రాలు పోటీపడ్డాయి. బుగోనియా, ఎఫ్1, ఫ్రాంకెన్‌స్టెయిన్, సెంటిమెంటల్ వాల్యూ వంటి చిత్రాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ, ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' అనే చిత్రం. 2026 సంవత్సరానికి గాను ఈ సినిమా ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు, ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పాల్ థామస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. అలాగే ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో యాండీ జార్గన్‌సన్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేలో పాల్ థామస్, బెస్ట్ కాస్టింగ్ విభాగంలో కసాండ్ర కులుకుండీస్ , ఉత్తమ సహాయ నటుడిగా సీన్ పెన్ అవార్డులను గెలుచుకున్నారు.

నటన పరంగా చూస్తే ఈసారి పోటీ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మైఖేల్ బీ జోర్డాన్ 'సిన్నర్స్' చిత్రంలో తన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ను సొంతం చేసుకున్నారు. అదేవిధంగా 'హమ్నెట్' చిత్రంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన జెస్సీ బక్లే ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇక 'వెపన్స్' చిత్రంలో నటించిన ఆమీ మాడిగాన్ ఉత్తమ సహాయ నటిగా విజేతగా నిలిచారు.

సాంకేతిక విభాగాలలో 'సిన్నర్స్' , 'ఫ్రాంకెన్‌స్టెయిన్' చిత్రాలు సత్తా చాటాయి. 'సిన్నర్స్' చిత్రానికి గాను ఆటమ్ డురాల్డ్ ఆర్కాపావ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును అందుకోగా, లుడ్ విగ్ గోరాసన్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో విజేతగా నిలిచారు. 'ఫ్రాంకెన్‌స్టెయిన్' చిత్రం కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ , ప్రొడక్షన్ డిజైన్ వంటి విభాగాలలో అవార్డులను గెలుచుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన 'అవతార్: ఫైర్ అండ్ యాష్' చిత్రంతో మరోసారి ఆస్కార్‌ను ముద్దాడారు.

పాటలు , యానిమేషన్ విభాగాలలో 'కె-పాప్ డెమన్ హంటర్స్' ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ చిత్రంలోని గోల్డెన్ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచింది. అలాగే ఇదే చిత్రం ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా కూడా ఎంపికైంది. అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో 'సెంటిమెంటల్ వాల్యూ' అవార్డును గెలుచుకోగా, డాక్యుమెంటరీ విభాగంలో 'మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్' ఉత్తమ డాక్యుమెంటరీగా గుర్తింపు పొందింది. సౌండ్ విభాగంలో 'ఎఫ్1' మూవీ సాంకేతిక నిపుణులు అవార్డును దక్కించుకున్నారు.

మొత్తానికి 98వ ఆస్కార్ వేడుకలు కేవలం అవార్డుల ప్రధానోత్సవంలా మాత్రమే కాకుండా, సినిమా పట్ల ఉన్న మక్కువను , కళాకారుల శ్రమను గౌరవించే ఒక గొప్ప వేదికగా నిలిచాయి. ప్రతి అవార్డు ప్రకటన వెనుక ఆయా కళాకారుల ఏళ్ల తరబడి కృషి దాగి ఉందని ఈ వేడుకలు మరోసారి నిరూపించాయి.

Tags:    

Similar News