Dhurandhar 2 VS Pushpa 2: దురంధర్ 2 జస్ట్ మిస్.. బన్నీ రికార్డ్ సేఫ్!

Dhurandhar 2 VS Pushpa 2: దురంధర్ 2 మూవీ మొదటిరోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే, అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.

Update: 2026-03-20 11:24 GMT

Dhurandhar 2 VS Pushpa 2

Dhurandhar 2 VS Pushpa 2: గత ఐదారు నెలలుగా హాట్ టాపిక్ గా ఉన్న మూవీ ఏదైనా ఉందీ అంటే అది దురంధర్. పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో భారత్ ను హై చేస్తూ వచ్చిన కల్ట్ రా మూవీ దురంధర్. డిసెంబర్ లో మొదటి పార్ట్ విడుదల సమయంలో దురంధర్ ఒక సాదాసీదా మూవీగానే రిలీజ్ అయింది. దర్శకుడు ఆదిత్యధర్ మొదటి మూవీ యూరీ లా హిట్ అయ్యే అవకాశాలున్నాయేమో అనుకున్నారు. కానీ, మూవీ రిలీజ్ అయ్యాకా అరే ఏంట్రా ఇదీ.. సినిమా ఇలాక్కూడా తీస్తారా? అని మహామహుల చేతనే అనిపించేసింది. సెలబ్రిటీలు.. విమర్శకులు.. మూవీ ఫాన్స్.. సాధారణ ప్రేక్షకులు అందరూ ఒకే మాట. ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. కాదు..కాదు ఇప్పటివరకూ రాలేదు అని. ధనాధనా బాక్సాఫీసుపై కాసుల వర్షం కురిపించేసింది ఈ మూవీ. ఇక దానికి కొనసాగింపుగా దురంధర్ 2 ఉంటుందని.. అది కూడా మార్చి నెలలో విడుదల అవుతుందనీ చెప్పేసారు. దీంతో అప్పుడే అందరూ దురంధర్ సెకండ్ పార్ట్ చూసేయాలి అని ఫిక్స్ అయిపోయారు.

మేకర్స్ చెప్పిన టైమ్ కే మూవీ థియేటర్లలోకి దూసుకు వచ్చింది. మళ్ళీ అందరూ అవాక్కయ్యారు. సీక్వెల్ చెప్పిన టైమ్ కి రిలీజ్ చేయడం కూడా ఒక రికార్డుగా మారింది. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు అయితే ఊగిపోతున్నారు. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నా.. థియేటర్లలో ఈలలు.. చప్పట్లు తప్ప కాస్త కూడా ప్రేక్షకుల నుంచి సైలెన్స్ మూమెంట్స్ లేవు. ఇది కదా సినిమా అంటే అని సెలబ్రిటీలు కూడా చెబుతున్న పరిస్థితి.

జస్ట్ మిస్..

ఇదిలా ఉంటే.. దురంధర్ 2 మొదటి రోజు సునామీ కలెక్షన్స్ తెచ్చింది. ఫైనల్ గా 'ధురందర్ 2' సినిమా మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. ఒక్కరోజే ఈ సినిమా ఏకంగా రూ. 236 కోట్లు వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఇక రాబోయే రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశమూ ఉంది. దీంతో ఇది ఎన్ని వేల కోట్లు కొల్లగొడుతుంది అనే అంచనాల్లో అందరూ పడిపోయారు.

ఇంత అఖండ విజయం మధ్యలో దురంధర్ 2 ఒక్క రికార్డ్ మిస్ అయిపోయింది. అది మొదటి రోజు ఈ మూవీకి 300 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తే ఆ నెంబర్ కూడా క్రాస్ అయిపోతుంది అనిపించింది. కానీ, సెన్సార్ పుణ్యమా అని ఆ జోరుకు బ్రేక్ పడిపోయింది. 300 కోట్లు కొట్టడం సాధ్యం కాలేదు. చివరి నిమిషంలో సెన్సార్ చెప్పిన 21 మార్పులను చేసి ప్రింట్స్ రెడీ చేయడం మూవీ యూనిట్ కు సవాల్ గా మారింది. దీంతో హిందీ తప్ప అన్ని ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయిపోయాయి. కొన్ని హిందీ స్క్రీన్స్ కూడా తగ్గాయి. ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. అందుకే 236 కోట్ల వద్ద ఆగిపోయింది.

బన్నీ రికార్డ్ సేఫ్..

దురంధర్ 2 సినిమాకి సెన్సార్ దెబ్బ పడడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్ సేఫ్ గా ఉండిపోయింది. ఆయన మూవీ పుష్ప 2 రికార్డును దురంధర్ 2 క్రాస్ చేయలేకపోయింది.

'పుష్ప 2' మొదటి రోజు రూ. 294 కోట్లు వసూలు చేసింది. 'ధురందర్ 2' ఈ రికార్డును బద్దలు కొడుతుందని అందరూ ఆశించారు. అయితే, అలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో సహా పలుచోట్ల 'ధురందర్ 2' ప్రదర్శనలు రద్దు అయ్యాయి. తెలుగు, కన్నడ కాపీలు అప్‌లోడ్ కాలేదు. రద్దుకు ఇదే ప్రధాన కారణం. ఇది సినిమాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

'ధురందర్ 2' భారీ విజయం సాధించడానికి దాని కథే కారణమని చాలామంది అంటున్నారు. రాబోయే రోజుల్లో 'ధురందర్ 2' మరింత వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా మొత్తం వసూళ్లు ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయనే దానిపై ఊహాగానాలు గట్టిగానే ఉన్నాయి. రేపటి నుంచి అన్ని భాషల్లోనూ మూవీ రిలీజ్ కాబోతోంది. శని, ఆదివారాలు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా దురంధర్ 2 కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్ బద్దలు కావచ్చనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News