Neethu Elimination

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదకొండో వారం ముగిసింది. 77వ రోజు, 78వ ఎపిసోడ్‌లో సండే ఫండే సందడి మధ్య మరో ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం నామినేషన్లలో ఉన్న నీతూ, సుధీర్‌లలో చివరకు నీతూ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. మరోవైపు సుధీర్ మరో వారం తన ఆటను కొనసాగించే అవకాశం దక్కించుకున్నాడు. ఎలిమినేషన్‌కు ముందు జరిగిన టాస్కులు, రష్మిక మందన్న సందడి, నీతూ చివరి మాటలు ఈ ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రష్మిక ఎంట్రీతో హౌస్‌లో సందడి

సండే ఫండే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను జంటలుగా విడగొట్టి సరదా టాస్కులు నిర్వహించారు. ఈ టాస్కుల్లో గెలిచినవారికి 12వ వారంలో కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచే అవకాశం కల్పించారు. త్రిగుణ్, ఆర్కే, శివ్, దేబ్జానీ, రాంప్రసాద్, ముకేష్ ఈ పోటీల్లో విజయం సాధించి కెప్టెన్సీ రేసులోకి వచ్చారు. ఇదే ఎపిసోడ్‌లో తన సినిమా మైసా ప్రమోషన్ల కోసం హీరోయిన్ రష్మిక మందన్న స్టేజ్‌పైకి వచ్చారు. ఆమెతో కలిసి నాగార్జున నిర్వహించిన సినిమా డైలాగ్ గుర్తుపట్టే ఆట ప్రేక్షకులను అలరించింది. డైలాగ్ ఏ సినిమాలోదో చెప్పి, ఆ తర్వాత పాటకు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. బాగా చేసినవారికి రష్మిక మార్కులు ఇచ్చారు.

త్రిగుణ్, శివ్ టాస్కుల్లో అదుర్స్

మొదట దేబ్జానీ, త్రిగుణ్ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత వంశీ, త్రిగుణ్ మధ్య తాడు పట్టుకుని ఎక్కువసేపు నిలబడే టాస్క్ నిర్వహించారు. ఇద్దరూ దాదాపు ఎనిమిది నిమిషాలకు పైగా పోటీపడ్డారు. చివరకు వంశీ చేతులెత్తేయడంతో త్రిగుణ్ విజయం సాధించాడు. ఇద్దరూ అంతసేపు పోరాడటాన్ని నాగార్జున అభినందించారు. మరో టాస్క్‌లో శివ్, అమన్ పోటీపడ్డారు. ఒక స్థంభంపై ఉన్న మూడు రింగులను తీసి మరో చిన్న స్థంభంపై అమర్చాల్సి వచ్చింది. ఈ పోటీలో శివ్ వేగంగా పూర్తి చేసి గెలిచాడు. రాంప్రసాద్, నరేష్ మధ్య జరిగిన టాస్క్‌లో నరేష్ విజయం సాధించగా, ఆర్కే, వర్షిణి కూడా తమ పోటీలో సేఫ్ అయ్యారు. దేబ్జానీ, నీతూ మధ్య జరిగిన సరదా టాస్క్‌లో దేబ్జానీ గెలిచింది.

రష్మికతో ముకేష్, శివ్ సరదా మాటలు

రష్మిక మందన్న స్టేజ్‌పై ఉన్న సమయంలో ముకేష్ తన కన్నడ మాటలతో ఆమెతో సరదాగా మాట్లాడాడు. కాలేజీలో తాను రష్మికకు సీనియర్ అని చెప్పడంతో ఆ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. శివ్ కూడా కన్నడలో రష్మిక అందాన్ని పొగిడాడు. ఈ క్రమంలో రష్మిక చేతుల మీదుగా ముకేష్, వంశీ సేఫ్ అయినట్లు ప్రకటించారు. మరోవైపు సుధీర్, ఆర్కే మధ్య జరిగిన టాస్క్‌లో ఆర్కే గెలిచాడు. తొలిసారి టాస్క్ గెలవడంతో అతడు ఎంతో సంతోషంగా అరుస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీతో పాటు సరదా సంభాషణలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సుధీర్ సేఫ్.. నీతూ ఎలిమినేట్

చివరగా నీతూ, సుధీర్ ఇద్దరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచారు. కళ్లకు గంతలు కట్టి కారులో కూర్చోబెట్టిన తర్వాత ఎవరు తిరిగి ఇంట్లోకి వస్తారోనని కంటెస్టెంట్లు అంచనాలు వేశారు. కొందరు సుధీర్ వస్తాడని, మరికొందరు నీతూ సేఫ్ అవుతుందని భావించారు. చివరకు సుధీర్ తిరిగి హౌస్‌లోకి రాగా, నీతూ ఎలిమినేట్ అయింది. స్టేజ్‌పైకి వచ్చిన నీతూ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది. తాను గొడవలు పెట్టుకోవడం, గట్టిగా అరవడం వంటి ఆట ఆడలేనని చెప్పింది. తన దృష్టిలో అమన్, శివ్, త్రిగుణ్ బాగా ఆడారని ప్రశంసించింది. వంశీ, సుధీర్, ముకేష్ ఆటతీరుపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా ముకేష్‌కు ఇకనైనా ఇతరుల అభిప్రాయాలను పక్కనపెట్టి సొంత నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు సుధీర్ మళ్లీ సేఫ్ కావడంతో నరేష్, రాంప్రసాద్ అతడిపై ఎంత కొట్టినా చావని పామురా నువ్వు అంటూ సరదాగా కామెంట్ చేశారు.

12వ వారం థీమ్ బడ్డీ అప్

నీతూ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం ముగిసింది. ఇక 12వ వారం బడ్డీ అప్ థీమ్‌తో ఆట కొనసాగుతుందని నాగార్జున ప్రకటించారు. ఈ థీమ్‌లో కంటెస్టెంట్లను జంటలుగా ఆడిస్తారా? స్నేహితులుగా కలిసి టాస్కులు ఇచ్చి పోటీ పెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్లుగా త్రిగుణ్, ఆర్కే, శివ్, దేబ్జానీ, రాంప్రసాద్, ముకేష్ నిలిచారు. ఈ వారం కెప్టెన్సీ పోటీతో పాటు కంటెస్టెంట్ల మధ్య సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి.

Tags: