Bigg Boss 10: టెంపర్ వంశీపై నాగార్జున ఫైర్.. వీడియో వేసి మరీ క్లాస్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10 శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున టెంపర్ వంశీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షిణి, ముకేశ్‌లకు క్లాస్ పీకారు.
Temper Vamsi
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 శనివారం ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున హౌస్‌లోని కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షిస్తూ తనదైన శైలిలో చురకలంటించారు. ముఖ్యంగా టెంపర్ వంశీ ప్రవర్తనపై నాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షిణి, ముకేశ్ గురించి వంశీ ఒక సందర్భంలో ఎక్కేయడం, తొక్కేయడం అంటూ అసభ్యకరమైన పదాలు వాడిన వీడియోను నాగార్జున అందరి ముందు ప్లే చేసి చూపించారు. గతంలో వంశీ 'కులకడం' అన్నప్పుడు తాను సమర్థించానని, కానీ ఇప్పుడు ఇలాంటి మాటలు చూస్తుంటే సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తిగా తలదించుకుంటున్నానని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వంశీ తప్పు తెలుసుకుని నాగార్జునకు, వర్షిణికి క్షమాపణలు చెప్పాడు.
డిక్టేటర్ గేమ్ రద్దుపై వర్షిణి, ముకేశ్‌లకు చివాట్లు
ఈ వారం జరిగిన డిక్టేటర్స్ గేమ్‌లో సంచాలకులుగా ఉన్న శివకుమార్, వర్షిణి మధ్య విభేదాలతో ఆట మొత్తం రద్దయిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున వర్షిణిని నిలదీశారు. వంశీ, ఆర్కే ఇద్దరూ ఫౌల్ గేమ్ ఆడినప్పుడు కేవలం వంశీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశావని ప్రశ్నించారు. మీ టీమ్‌కే ఎక్కువ పాయింట్లు ఉన్నా బెస్ట్ సంచాలక్ అనిపించుకోవడం కోసం కాంప్రమైజ్ కాకుండా గేమ్ రద్దు చేశావని క్లాస్ పీకారు. ఇదే విషయంపై రామ్ ప్రసాద్ గట్టిగా వాదనలు వినిపించారు. తర్వాత డిక్టేటర్లుగా ముకేశ్, త్రిగుణ్‌లకు మార్కులు వేయాలని నాగ్ అడగ్గా.. ముకేశ్‌కు వర్షిణి 90 మార్కులు ఇస్తే, తక్కువగా అంచనా వేశాడన్న కోపంతో రామ్ ప్రసాద్ 30 మార్కులే ఇచ్చారు. సగటున ముకేశ్‌కు 50 మార్కులు రాగా, త్రిగుణ్‌కు తన టీమ్ నుంచి సగటున 90 మార్కులు రావడంతో నాగార్జున అభినందించారు.
వర్షిణిని ఓడించి కెప్టెన్సీ రేసులో ముకేశ్ గెలుపు
మాటల యుద్ధం తర్వాత హౌస్‌లో మళ్లీ గేమ్ సందడి మొదలైంది. వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్ అర్హత కోసం వర్షిణి, ముకేశ్ మధ్య పోటీ జరిగింది. ఈ టాస్క్‌లో వర్షిణిని అడ్డుకుని మరీ ముకేశ్ విజయం సాధించి కెప్టెన్సీ రేసులోకి అడుగుపెట్టాడు. మిగిలిన ఇంటి సభ్యులకు సంబంధించిన ఆట ఆదివారం ఎపిసోడ్లో కొనసాగనుందని నాగార్జున ప్రకటించారు. గ్రాండ్ ఫినాలేకు కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో హౌస్‌లో పోటీ మరింత వేడెక్కింది.
నీతూ నటరాజ్ మాస్టర్ అవుట్?
11వ వారం నామినేషన్లలో త్రిగుణ్, ముఖేశ్, అమన్, దేబ్జానీ, రామకృష్ణ, వర్షిణి, రామ్ ప్రసాద్, వంశీ, సుధీర్, శివ, నీతూ మాస్టర్ సహా మొత్తం 11 మంది ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వారం నీతూ నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటింగ్‌లో ఆమె చివరి స్థానంలో నిలవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. షో ప్రారంభంలో ఫైరింగ్‌తో హడావుడి చేసినా, ఆ తర్వాత జోరు తగ్గి కంటెంట్ ఇవ్వడంలో విఫలమవడం ఆమెకు మైనస్ అయిందని అంటున్నారు.
డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
ఫినాలే సమయం దగ్గర పడుతుండటంతో కంటెస్టెంట్ల సంఖ్యను తగ్గించేందుకు నిర్వాహకులు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఓటింగ్ సరళి ప్రకారం నీతూతో పాటు రామకృష్ణ, సుధీర్, శివ డేంజర్ జోన్లో ఉన్నారు. బయట భారీ ఫాలోయింగ్ ఉండి టైటిల్ రేసులో ఉంటుందనుకున్న వర్షిణి కూడా అనూహ్యంగా డేంజర్ జోన్లోకి రావడం చర్చనీయాంశమైంది. అయితే శివకుమార్‌కు టాప్-5లో ఉండే అవకాశం ఉన్నందున అతన్ని సేవ్ చేసి, డబుల్ ఎలిమినేషన్ ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రామకృష్ణ లేదా సుధీర్‌లో ఒకరిని బయటకు పంపొచ్చని అంటున్నారు. దీనిపై ఆదివారం ఎపిసోడ్లో పూర్తి స్పష్టత రానుంది.