Sangareddy: సంగారెడ్డి డీఎంహెచ్‌ఓ వసంత్ రావు బాగోతం.. మృతుడి కుటుంబానికి రావాల్సిన రూ.10 లక్షల పరిహారం స్వాహా!
Sangareddy: సంగారెడ్డిలో తీవ్ర కలకలం. మృతుడు వెంకటేష్ కుటుంబానికి నష్టపరిహారంగా ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన రూ.10 లక్షల డబ్బులను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న డీఎంహెచ్‌ఓ వసంత్ రావు.
సంగారెడ్డి డీఎంహెచ్‌ఓ వసంత్ రావు బాగోతం.. మృతుడి కుటుంబానికి రావాల్సిన రూ.10 లక్షల పరిహారం స్వాహా!
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. గతేడాది ప్రయివేటు ఆస్పత్రి నిర్లక్ష్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి అందాల్సిన నష్టపరిహారం డబ్బులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) వసంత్ రావు తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు రుజువైంది. బదిలీపై వెళ్తున్న ఆయనను బాధితులు నిలదీయడంతో ఈ దారుణం కాస్తా బయటపడింది.
గతేడాది నవంబర్ 18న సంగారెడ్డిలోని ఒక ప్రముఖ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం మరియు వైద్యుల నిర్లక్ష్యం వల్లే వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయం అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో.. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంత్రి ఆదేశాలు, మధ్యవర్తిత్వంతో ఆస్పత్రి యాజమాన్యం మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల భారీ నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది.
ఒప్పందం ప్రకారం ఆస్పత్రి యాజమాన్యం రూ. 15 లక్షల నగదును నేరుగా మృతుడి కుటుంబ సభ్యులకు అందజేసింది. అయితే, మిగిలిన రూ. 10 లక్షల మొత్తాన్ని నమ్మకంతో నాటి డీఎంహెచ్‌ఓ వసంత్ రావుకు అప్పగించింది. ఆ తర్వాత గత కొన్ని నెలలుగా మృతుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు తమకు రావాల్సిన రూ. 10 లక్షల కోసం డీఎంహెచ్‌ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. వసంత్ రావు "ఈ రోజు ఇస్తా, రేపు ఇస్తా" అంటూ కాలయాపన చేస్తూ, ఆ డబ్బును తన స్వంతానికి వాడుకున్నారు.
తాజాగా డీఎంహెచ్‌ఓ వసంత్ రావు సంగారెడ్డి నుండి వేరే ప్రాంతానికి బదిలీ (ట్రాన్స్‌ఫర్) అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు శనివారం తక్షణమే డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చేరుకుని వసంత్ రావును ఘోరాతి ఘోరంగా నిలదీశారు. నష్టపరిహారం డబ్బులు ఇవ్వకుండా ఎలా వెళ్తారంటూ సదరు అధికారిపై మండిపడ్డారు.
బాధితుల ఆగ్రహాన్ని, తీవ్రతను గమనించిన వసంత్ రావు లబోదిబోమంటూ అప్పటికప్పుడు తన వద్ద ఉన్న రూ. 5 లక్షల నగదును బాధితులకు సర్దేశారు. మిగిలిన రూ. 5 లక్షల మొత్తాన్ని ఈ నెల 10వ తేదీ లోపు ఖచ్చితంగా చెల్లిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో వెంకటేష్ కుటుంబ సభ్యులు శాంతించారు. ఒక బాధ్యతాయుతమైన ఉన్నతాధికారి, అందులోనూ బాధిత కుటుంబానికి చెందాల్సిన పరిహారం డబ్బులను వాడుకోవడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.