Medak: ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే నాయకత్వ లక్షణాలు: మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కిశోర బాలికల 'మాక్ పార్లమెంట్' సదస్సు!

Medak: మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికల స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్ నిర్వహించారు.

Update: 2026-05-30 13:19 GMT

Medak: ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే నాయకత్వ లక్షణాలు: మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కిశోర బాలికల 'మాక్ పార్లమెంట్' సదస్సు! 

మెదక్: ప్రజాస్వామ్య స్ఫూర్తిని విద్యార్థుల్లో పెంపొందించడమే లక్ష్యంగా మాక్ పార్లమెంట్ నిర్వహణ ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.

శనివారం, బాలల హక్కులు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక సమస్యలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ - గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్నేహ సంఘాల సభ్యుల మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎంపికైన బాలికలు సభాపతి, మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు, ప్రజా ప్రతినిధుల పాత్రలను పోషిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా నిర్వహించారు. సభా నిర్వహణ, చర్చలు, ప్రశ్నోత్తరాల ద్వారా తమ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరిచారు.

మాక్ పార్లమెంట్‌లో విద్యార్థులు బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలికల భద్రత, విద్యా సౌకర్యాలు, ఆరోగ్య సేవలు, పోషకాహారం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యాభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించాలని, పాఠశాలల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సురక్షిత వాతావరణం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు.బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు బాల కార్మిక (నిషేధం మరియు నియంత్రణ) చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని విద్యార్థులు కోరారు. ప్రతి బాలుడు విద్యను పొందే హక్కు కలిగి ఉన్నందున చిన్నారులను పనుల్లో నిమగ్నం చేయకుండా పాఠశాలల్లో చేర్పించేందుకు సమాజం బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు.

బాలికల భద్రతకు సంబంధించి పోక్సో చట్టం, సైబర్ నేరాల నివారణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళా హెల్ప్‌ లైన్ 181, చైల్డ్ హెల్ప్‌ లైన్ 1098 వంటి అంశాలపై మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, సైబర్ వేధింపులు లేదా మోసాలు ఎదురైతే వెంటనే 1930 హెల్ప్‌ లైన్‌ను సంప్రదించాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. బాలికలు తమ హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

యుక్త వయసు బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందే ఈ స్నేహ సంఘాలు అని, ప్రతి గ్రామ పంచాయతీలో ఈ సంఘాలు ఏర్పాటు అయ్యాయన్నారు.

బాలికల రక్షణ, సంరక్షణ కింద బాల్య వివాహాల నిర్మూలనకు 1098 చైల్డ్ లైన్ నంబర్ లో సంప్రదించాలని, ఇంట్లో ఏమైనా సమస్య తలెత్తితే సఖి సహాయ కేంద్రం 181, పోలీస్ 100 కు డయల్ చేయాలని, అలాగే రాష్ట్రంలో గుట్కా, పొగాకు, గంజాయి విక్రయాలు, సరఫరాపై నిషేధం ఉందని, అలాంటి అలవాట్లకు ఎవరైనా బానిస అయితే, విక్రయాలకు ఎవరైనా పాల్పడితే ఈగల్ బృందం 1908 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలని కోరారు.పాఠశాలల్లో తరగతి గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి వాటి గురించి ఈ స్నేహ సంఘాలు చర్చించాలని, రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

పాఠశాలలు, కళాశాలల్లో బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, బాలల రక్షణకు సంబంధించిన ఇతర చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఏవైనా వేధింపులు, హింస (లేదా) భద్రతా సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఫిర్యాదు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు.విద్యార్థుల్లో మంచి నడవడి, నైతిక విలువలు, పరస్పర గౌరవ భావన పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.బాలికలు విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే స్థాయికి ఎదగాలని సూచించారు. జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకున్నా కష్టపడి పనిచేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 14000 మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా తీర్చిదిద్దారని అన్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బాలికల భద్రతకు సంబంధించిన చట్టాలు, సైబర్ భద్రత, స్టాకింగ్ వంటి నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు.మాక్ పార్లమెంట్ ద్వారా విద్యార్థుల్లో వక్తృత్వ నైపుణ్యాలు, నాయకత్వ సామర్థ్యాలు, సమస్యలను విశ్లేషించే దృక్పథం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు.బాలికల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాలను అలవర్చుకోవడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.విద్యార్థినులకు ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలు, లక్ష్య సాధన కోసం అనుసరించాల్సిన మార్గాలపై ప్రత్యేక అవగాహన ఉండాలని తెలిపారు. తమ అభిరుచులు, ప్రతిభకు అనుగుణంగా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు.బాలికల భద్రత దృష్ట్యా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటి వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.

మహిళలు, బాలికల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో (POCSO) చట్టం, స్టాకింగ్ వంటి నేరాలపై అవగాహన పెంపొందించాలని తెలిపారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, వేధింపులపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు.

అనంతరం మాక్ పార్లమెంట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఉల్లాస్ కింద ట్రైనర్, లెర్నర్ లకు ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జెడ్పి సీఓ ఎల్లయ్య, డిఆర్.డి.ఓ శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్ , బి డబ్ల్యు ఓ హేమా భార్గవి , అడిషనల్ డిఆర్డిఓ సరస్వతి సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కిశోర బాలికలు పాల్గొన్నారు.

Tags:    

Similar News