Narsapur: నర్సాపూర్ - యాదగిరిగుట్ట మధ్య నూతన ఆర్టీసీ బస్సు

Narsapur: ప్రయాణికుల సౌకర్యార్థం నర్సాపూర్ నుంచి యాదగిరిగుట్టకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం. ఉదయం 7 గంటలకు బయలుదేరనున్న బస్సు.

Update: 2026-08-16 10:57 GMT

Narsapur: నర్సాపూర్ - యాదగిరిగుట్ట మధ్య నూతన ఆర్టీసీ బస్సు

నర్సాపూర్: నర్సాపూర్ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త అందించింది. యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులు, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నర్సాపూర్ డిపో ఆధ్వర్యంలో నర్సాపూర్ నుంచి యాదగిరిగుట్టకు నూతన బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు. ఈ నూతన సర్వీసు రేపటి నుంచి ప్రతిరోజూ అందుబాటులోకి రానుంది.

ఉదయం 7 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి..

నర్సాపూర్ బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు నూతన బస్సు సర్వీస్ ప్రారంభమవుతుంది. ఈ బస్సు నర్సాపూర్ నుంచి మంగళపర్తి, వెల్దుర్తి, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా యాదగిరిగుట్టకు ప్రయాణిస్తుంది. ప్రయాణికులను ఆయా ప్రాంతాల్లో ఎక్కించుకుని, దింపుతూ ఉదయం 11:30 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకునేలా సర్వీసును ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుగు ప్రయాణం

యాదగిరిగుట్టలో దర్శనం, ఇతర అవసరాలు పూర్తి చేసుకున్న ప్రయాణికులు తిరిగి నర్సాపూర్ చేరుకునేందుకు కూడా ఇదే బస్సు సౌకర్యం కల్పించనుంది. యాదగిరిగుట్ట నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు బస్సు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, వెల్దుర్తి, మంగళపర్తి మీదుగా ప్రయాణించి సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్ బస్ స్టేషన్‌కు చేరుకుంటుంది.

యాదగిరిగుట్ట భక్తులకు ఎంతో ఉపయోగకరం

నర్సాపూర్ ప్రాంతం నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు, అలాగే విద్య, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు ఈ నూతన బస్సు సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా ఒకే బస్సులో నర్సాపూర్ నుంచి యాదగిరిగుట్ట వరకు వెళ్లి, అదే సర్వీసులో తిరిగి నర్సాపూర్ చేరుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.

సర్వీసును సద్వినియోగం చేసుకోవాలి

నర్సాపూర్ పట్టణంతో పాటు మంగళపర్తి, వెల్దుర్తి, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మార్గంలోని గ్రామాల ప్రజలు ఈ నూతన బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ డిపో అధికారులు కోరుతున్నారు. ప్రయాణికుల ఆదరణను బట్టి భవిష్యత్‌లో సర్వీసులను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని తెలిపారు.

నూతన బస్సు సర్వీసును ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వినియోగించుకుని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని నర్సాపూర్ డిపో మేనేజర్ పరమేశ్వరి కోరారు.

Tags:    

Similar News