Narsapur: మహిళా సర్పంచుల స్థానంలో భర్తల ప్రత్యక్షం!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జీపీ అభివృద్ధి సమావేశానికి మహిళా సర్పంచులు గైర్హాజరై
Narsapur: మహిళా సర్పంచుల స్థానంలో భర్తల ప్రత్యక్షం!
నర్సాపూర్... జూలై 21:-
"ప్రజలు ఎన్నుకున్నది మహిళా సర్పంచులను... కానీ సమావేశంలో కనిపించింది మాత్రం వారి భర్తలు..! ఇది గ్రామపంచాయతీ పాలనలో మహిళల సాధికారతా... లేక 'సర్పంచ్ పతి' వ్యవస్థకు మరో ఉదాహరణా..? మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక సమావేశంలో పలువురు మహిళా సర్పంచులు గైర్హాజరు కాగా, వారి స్థానాల్లో భర్తలు కూర్చొని సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది."
మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు సంబంధించిన కీలక సమావేశం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి.
ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న పలువురు మహిళా సర్పంచులు సమావేశానికి హాజరుకాకపోగా, వారి స్థానాల్లో భర్తలు కూర్చొని సమావేశంలో పాల్గొనడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. అధికారులు సమావేశం నిర్వహిస్తుండగా, మహిళా సర్పంచుల స్థానంలో వారి భర్తలే చర్చలు వినడం, సమావేశంలో పాల్గొనడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
మహిళా రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు నాయకత్వ అవకాశాలు కల్పించిన నేపథ్యంలో, ఎన్నికైన ప్రజాప్రతినిధులు స్వయంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు సమావేశాల్లో వారి స్థానంలో కుటుంబ సభ్యులు పాల్గొనడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా గ్రామాభివృద్ధికి సంబంధించిన ఈ కీలక సమావేశానికి కొందరు మండల అధికారులు, మరికొందరు సర్పంచులు కూడా గైర్హాజరైనట్లు సమాచారం. గ్రామాల భవిష్యత్ అభివృద్ధి కోసం నిర్వహించే సమావేశాల పట్ల ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
"ప్రజలు ఎన్నుకున్నది మహిళా సర్పంచులను... సమావేశాల్లో పాల్గొంటోంది మాత్రం వారి భర్తలు. గ్రామస్థాయిలో మహిళల నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యానికి ఇలాంటి ఘటనలు ఎంతవరకు దోహదపడతాయి..? ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి....