Narsapur: నర్సాపూర్ బీవీఆర్ఐటీకి ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు!
Narsapur: నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT) కళాశాల ప్రతిష్ఠాత్మక "మ్యాథ్‌వర్క్స్ క్రెడెన్షియలింగ్ అవార్డు – 2026" సొంతం చేసుకుంది.
Narsapur: నర్సాపూర్ బీవీఆర్ఐటీకి ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు!
నర్సాపూర్, జూలై 21: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ) మరో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. ఇంజినీరింగ్ విద్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నందుకు కళాశాలకు "మ్యాథ్‌వర్క్స్ క్రెడెన్షియలింగ్ అవార్డు – 2026" లభించింది.
హైదరాబాద్‌లోని మ్యాథ్‌వర్క్స్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. కళాశాలలో మ్యాట్‌ల్యాబ్ (MATLAB), సిమ్యులింక్ (Simulink) సాఫ్ట్‌వేర్‌లను బోధన, పరిశోధన, విద్యార్థుల ప్రాజెక్టుల్లో సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు ఈ గుర్తింపు దక్కింది.
ఈ అవార్డును శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, బీవీఆర్ఐటీ ప్రిన్సిపాల్ డా. సంజయ్ దుబే, ఈఈఈ విభాగాధిపతి డా. రాయుడు, ఈసీఈ విభాగాధిపతి డా. సంజీవ రెడ్డి, ఈఈఈ విభాగ ప్రొఫెసర్ డా. భూపాల్ స్వీకరించారు.
ఈ సందర్భంగా మ్యాథ్‌వర్క్స్ ఎడ్యుకేషన్ టీమ్ టెక్నికల్ మేనేజర్ విజ్జు రవిచంద్రన్, ప్రిన్సిపల్ ఇంజినీర్ రమణ రెడ్డి మాట్లాడుతూ మ్యాట్‌ల్యాబ్ సాఫ్ట్‌వేర్ తయారీ, రక్షణ మరియు ఏరోస్పేస్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, ఫార్మా వంటి అనేక కీలక రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నట్లు వివరించారు.
అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Generative AI), ఏజెంటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Agentic AI) ఆధారిత సాంకేతికతలను ఉపయోగించి విద్యార్థులు రూపొందిస్తున్న ప్రాజెక్టులు ఇంజినీరింగ్ విద్యలో నూతన దిశను చూపిస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
సమావేశంలో పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు), అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మ్యాథ్‌వర్క్స్ ఛాలెంజ్ ప్రాజెక్టులు, క్రెడిట్ కోర్సులు, ఎక్స్‌టెండెడ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, తొలి సంవత్సరం విద్యార్థులకు ఇంజినీరింగ్ ఎక్స్‌ప్లోరేషన్ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.
ఈ అవార్డు బీవీఆర్ఐటీ నర్సాపూర్ విద్యా ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని కళాశాల యాజమాన్యం పేర్కొంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో తీర్చిదిద్దేందుకు భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.