Chennur: చెన్నూర్‌లో బీజేపీ నాయకుల ముందస్తు హౌస్ అరెస్ట్

చెన్నూర్‌: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమిట్ నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్‌ నివాసానికి వెళ్ళిన పోలీసులు ఆయనతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, కేవలం కరువు మండలాలను ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. రాష్ట్రంలోని అసలు సమస్యలు, కరువు పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత్ సమిట్ నిర్వహిస్తోందని ఆరోపించారు.

దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులను రాష్ట్రానికి ఆహ్వానించి, దేశంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక భావజాలం కలిగిన సంస్థలను సమిట్‌కు ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య విలువలను పాటించని, కమ్యూనిజాన్ని ప్రోత్సహిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్న దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌లో సమావేశమై ఏం చర్చిస్తున్నారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

Tags: