Kurnool: నీటి విషయంలో కర్నూలు జిల్లా ప్రజలకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం!

Kurnool: శ్రీశైలం నీటి విషయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు.

Update: 2026-08-22 13:45 GMT

Kurnool: నీటి విషయంలో కర్నూలు జిల్లా ప్రజలకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం!

కర్నూలు: టీడీపీ నేతల తీరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి విషయంలో కర్నూలు జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 134 కిలోమీటర్ల హంద్రీనీవా ప్రాజెక్టు కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారని, అయితే నేడు కూటమి ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు.

హంద్రీనీవా చుట్టుపక్కల ఉన్న చెరువులకు ముందుగా నీటిని నింపండి అని డిమాండ్ చేశారు. గోరకల్లు రిజర్వాయర్‌ నుంచి ఎస్సార్బీసీ కాలువకు నీటిని విడుదల చేస్తే పాణ్యం, బనగానపల్లె మండలాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. అయితే పోలీసుల అండదండలతో ప్రభుత్వం దౌర్జన్యంగా నీటిని విడుదల చేయకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు.

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎస్సార్బీసీకి నీరు వదలించండి..

గోరకల్లు రిజర్వాయర్ నుంచి గాలేరు-నగరికి ఏ విధంగా నీటిని అందిస్తున్నారో అదే విధంగా ఎస్సార్బీసీ కాలువకు కూడా నీటిని విడుదల చేయాలి” అని కాటసాని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజూ మోటార్ల ద్వారా తరలించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో నీటి కోసం ప్రజలు, రైతులు, పశువులు సైతం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

జిల్లా మంత్రులు తక్షణమే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. “రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ మిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మోటార్ల ద్వారా నీటి తరలింపును నిలిపివేసి, కర్నూలు జిల్లా ప్రజల నీటి సమస్యను పరిష్కరించాలి” అని కాటసాని డిమాండ్ చేశారు.

ప్రజలు, రైతులు, పశువులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇకనైనా మొద్దునిద్ర వీడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోతిరెడ్డిపాడు నీటి పరిస్థితిని పరిశీలించేందుకు సోమవారం మాజీ మంత్రి శైలజానాథ్‌తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులమంతా కలిసి వెళ్లనున్నామని కాటసాని రామభూపాల్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News