Kurnool: కర్నూలులో ఘనంగా అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
Kurnool: కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యువజన దినోత్సవం. హాజరైన రాయలసీమ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు, పలువురు అధికారులు.
Kurnool: కర్నూలులో ఘనంగా అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
కర్నూలు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు) వేదికగా బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కళాశాల యాజమాన్యం మరియు జిల్లా యువజన సంక్షేమ శాఖ - సెట్కూరు కర్నూలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వేడుకలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ఇందిరా శాంతి అధ్యక్షత వహించారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ కె.వేణుగోపాల్ కార్యక్రమ స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయలసీమ యూనివర్సిటీ మరియు క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు ఇతర అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చగల సత్తా నేటి యువతకు మాత్రమే ఉందన్నారు. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను జోడించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
విశిష్ట అతిథిగా హాజరైన క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. మారుతున్న గ్లోబల్ మార్కెట్‌కు అనుగుణంగా విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. యువత సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, యువశక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగించాలని కోరారు.
జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి పి.దీప్తి మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగరాజు శెట్టి, కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ డా. సోమశేఖర్, పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువత క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని వారు స్పష్టం చేశారు.
యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ శ్రీ పి. నాగార్జున గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు మరియు ఇంగ్లీషు భాషలో వ్యాసరచన, డిబేట్ మరియు వక్తృత్వ పోటీలను నిర్వహించారు.
విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం, సెట్కూరు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.