Kurnool: కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ, ఏపీ రైతు సంఘం డిమాండ్!

Kurnool: కరువు జిల్లాగా ప్రకటించాలని, ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేవనకొండలో సీపీఐ, ఏపీ రైతు సంఘం నేతలు పంట పొలాలను పరిశీలించారు.

Update: 2026-08-01 15:02 GMT

Kurnool: కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ, ఏపీ రైతు సంఘం డిమాండ్!

కర్నూల్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని నష్టపోయిన రైతుకు ఎకరాకు 50 వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి బ్యాంకుల్లో ఉన్న రైతుల అన్ని రకాల అప్పులు రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, డిమాండ్ చేశారు.

శనివారం సిపిఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కరువు పరిశీలన జీపు జాత దేవనకొండకు వచ్చిన సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో రైతుల యొక్క పంట పొలాలను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

ఆకాశం వైపు ఆశగా చూస్తూ విత్తనాలు చల్లిన రైతన్నకు ఈ ఏడాది ప్రకృతి తీవ్ర నిరాశనే మిగిల్చిందన్నారు. కర్నూలు జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వేలాది ఎకరాల్లో సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులు ఇప్పుడు పంటలు కళ్లముందే ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. కుటుంబ పోషణ ఎలా చేయాలన్న ఆందోళనలో అనేక మంది రైతులు రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతు కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రైతులు చెల్లించిన పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరించి, ఇప్పటికే రైతులు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేయాలని కోరారు. అలాగే కరువు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి రైతు కుటుంబానికి ఆరు నెలల పాటు నెలకు రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు, పంట నష్టానికి ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3న అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

రాజకీయాలకు అతీతంగా రైతు సోదరులంతా ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె. నాగేంద్ర, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజా సాహెబ్, జిల్లా సమితి సభ్యుడు కారన్న, రైతు సంఘం జిల్లా నాయకులు తిమ్మప్ప సిపిఐ రైతు సంఘం నాయకులు బజారి వీరాంజి భాస్కర్ లక్ష్మన్న శ్రీనివాసులు రామాంజి రాహుల్, భూసల రామాంజి మధు నాగేంద్ర రామస్వామి మల్లి, టక్కు.రామంజి పలువురు రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News