Giddalur: గిద్దలూరు మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకార ఏర్పాట్ల పరిశీలన!

మార్కాపురం జిల్లా: గిద్దలూరు పురపాలక సంఘానికి నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ల (సభ్యుల) ప్రమాణ స్వీకారం మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

స్థానిక గిద్దలూరు పురపాలక సంఘ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ జరగుతున్న ప్రమాణ స్వీకారం మరియు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా, తగిన మౌలిక వసతులు కల్పించాలని గిద్దలూరు మున్సిపల్ కమిషనర్‌కు పలు కీలక సూచనలు, సలహాలు అందించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గిద్దలూరు నూతన పురపాలక మండలి ప్రమాణ స్వీకారం మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియ స్థానిక పురపాలక సంఘ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించబడుతుందని తెలిపారు. సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని‌ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ రమణ బాబు, పురపాలక శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags: