Kurnool: రైతులకు పంట బీమా వర్తింపజేయాలని కర్నూలు కలెక్టర్!
Kurnool: తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలయ్యే నీటిని కేవలం తాగునీటి అవసరాలకే కేటాయించాలని స్పష్టం చేశారు. ఈ అనావృష్టి నివారణ సమీక్ష పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Kurnool: రైతులకు పంట బీమా వర్తింపజేయాలని కర్నూలు కలెక్టర్!
కర్నూలు: జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో అనావృష్టి పరిస్థితులు నెలకొని ఉండటం వల్ల రైతుల నష్టపోకుండా పంట బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు పంట బీమా పై అవగాహన కల్పించాలని, ఏ రైతు నష్టపోకూడదనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఈ లక్ష్య సాధనకు అన్ని చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సంవత్సరం ఎల్‌నినో కారణంగా అత్యల్ప వర్షపాతం నమోదవడంతో తుంగభద్ర డ్యాం నుండి కేటాయింపుల కంటే తక్కువగా నీరు విడుదల అయ్యే అవకాశం ఉందని, రేపు నుండి 1.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారని, ఈ నీటిని త్రాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని, వ్యవసాయ అవసలరాలకు వాడకూడదని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రజల దాహార్తిని తీర్చడానికి తాగునీరును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
పత్తికొండ నియోజకవర్గం లో నూతనంగా ఏర్పాటుచేసిన టమాటో ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి సివిల్ వర్క్ పూర్తయిందని, ఆగస్టు నెల చివరికల్లా మెషినరీ అందుబాటులోకి రానుందని తెలియజేశారు. టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు అవసరమైన మేలు రకం టమాటో వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
జిల్లాలోని కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు ఇవ్వడం జరిగిందని, అయితే సిబిల్ స్కోర్ లేని కారణంగా వీరికి లోన్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించి రుణాలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను ఆదేశించామని వివరించారు.
ఎల్‌నినో అనావృష్టి ప్రభావం నుండి బయటపడాలంటే రైతులందరూ మోనోక్రాపింగ్ (ఒకే పంటను పండించడం) చేయకూడదని సూచించారు. ప్రి మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు మొదలగు 36 రకాల గింజలు జీవామృతంతో శుద్ధి చేసుకుని, మట్టి, బూడిదతో కలిపి చేలల్లో చెల్లుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. పిఎండిఎస్ వలన భూసారం పెరిగి, నీటిమట్టం రక్షించబడి, ప్రధాన పంటకు నీడ అందుతుందని వివరించారు. పిఎండిఎస్ వలన ప్రధాన పంటకు 15 రోజుల పాటు నీరు లేకపోయినా ఇబ్బంది లేకుండా ఉంటుందని వెల్లడించారు. పిఎండిఎస్ వల్ల ప్రధాన పంట రక్షించబడుతుందని, యూరియా తదితర ఎరువుల వాడకం కూడా తగ్గుతుందని తెలియజేశారు. అధికారులు రైతులకు పిఎండిఎస్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ప్రస్తుతమున్న వర్షాభావ పరిస్థితులలో, రైతులు కేవలం వ్యవసాయం మీదే ఆధారపడకుండా, పశుపోషణతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఫామింగ్ చేపట్టాలని సూచించారు.
జిల్లాలోని పశ్చిమ ప్రాంత రహదారులపై ఆర్ అండ్ బి శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మెరుగైన విద్యకు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని, ఇందుకు సంబంధించి అంచనాలు, నిధుల మంజూరు అంటూ కాలయాపన చేయకుండా, అదనపు తరగతి గదులు మొదలగు పనులను సత్వరమే, త్వరితగతిన చేపట్టాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశించారు.
మెరుగైన విద్యా వ్యవస్థకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, విద్యా శాఖల మధ్య సమన్వయంతోనే మెరుగైన ఫలితాలు రాబట్టడానికి వీలవుతుందని పేర్కొన్నారు. రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని, అప్పటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖకు సూచించారు.