Bhadrachalam: కార్తీక పౌర్ణమి వేళ భద్రాచలం గోదావరి తీరంలో పోటెత్తిన భక్తులు!

భద్రాచలం నవంబర్ 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కార్తీక పౌర్ణమి పర్వదినం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే పవిత్ర గోదావరి నదీ తీరానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు నదీ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అరటి డొప్పల్లో కార్తీక దీపాలను వెలిగించి గోదావరిలో వదిలారు. వేలాది దీపాల వెలుగులతో గోదావరి తీరం ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది.

మరోవైపు భద్రాద్రి రామాలయ అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు.

Tags: