Sircilla: సిరిసిల్ల చిన్నారికి హై రేంజ్ వరల్డ్ బుక్ రికార్డ్స్ దక్కాయి
Sircilla: సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి బ్లెస్సీ డ్రోన్ల ద్వారా విత్తన బంతులు చల్లుతూ 'హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' సాధించింది.
Sircilla: సిరిసిల్ల చిన్నారికి హై రేంజ్ వరల్డ్ బుక్ రికార్డ్స్ దక్కాయి
రాజన్న సిరిసిల్ల జిల్లా: పర్యావరణ పరిరక్షణ కోసం చిన్న వయసు నుంచే విశేష కృషి చేస్తున్న సుద్దాల గ్రామానికి చెందిన 12 ఏళ్ల చిన్నారి ప్రకృతి బ్లెస్సీ అరుదైన ఘనత సాధించింది. ఆమె సేవలను గుర్తించిన హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ.. ప్రకృతి బ్లెస్సీకి రికార్డు సర్టిఫికెట్‌ను అందజేసింది.
ప్రకృతి ప్రకాష్ కుమార్తె అయిన ప్రకృతి బ్లెస్సీ ప్రస్తుతం బద్దెనపల్లి గురుకులంలో ఏడో తరగతి చదువుతోంది. చిన్న వయసు నుంచే ప్రకృతి, అడవులు, పచ్చదనం, జీవకోటి మనుగడపై అవగాహన పెంచుకున్న ఆమె.. మూడేళ్ల వయసు నుంచే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
2.65 లక్షల విత్తనాలు.. విత్తన బంతులు
చెట్ల కింద రాలిన విత్తనాలను సేకరించి.. వాటిని మట్టితో కలిపి విత్తన బంతులుగా తయారు చేస్తోంది. తన తండ్రి ప్రకాష్ సహకారంతో డ్రోన్ల ద్వారా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అడవుల్లో ఇప్పటివరకు సుమారు 2 లక్షల 65 వేల విత్తనాలు, విత్తన బంతులను చల్లినట్లు తెలిపారు.
అడవులు, చెట్లు అంతరించిపోతే జీవకోటి మనుగడకు ముప్పు ఏర్పడుతుందనే ఆలోచనతో చిన్న వయసులోనే ప్రకృతి సంరక్షణను తన బాధ్యతగా స్వీకరించినట్లు బ్లెస్సీ తెలిపారు.
గచ్చిబౌలి ఇందూర్ స్టేడియంలో సర్టిఫికెట్ ప్రదానం
హైదరాబాద్ గచ్చిబౌలి ఇందూర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్ బ్రాండ్ అంబాసిడర్, గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి, సీఈఓ సుమన్ పల్లె చేతుల మీదుగా ప్రకృతి బ్లెస్సీకి హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రకృతి బ్లెస్సీ మాట్లాడుతూ.. తనకు లభించిన అవార్డులు, రికార్డులు ప్రకృతి సంరక్షణ కోసం మరింత బాధ్యతను పెంచాయని తెలిపింది. ప్రతి ఒక్కరూ ప్రకృతి సంరక్షణ కోసం ముందుకు వస్తేనే భావితరాలకు, జీవకోటికి మనుగడ ఉంటుందని పేర్కొంది. తన కృషిని గుర్తించి రికార్డు అందించిన వరల్డ్ బుక్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
సుద్దాల గ్రామానికి గర్వకారణం
ప్రకృతి బ్లెస్సీకి రికార్డు లభించడంపై గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం, సినీ గేయ రచయిత మల్లిక్ తేజ, బద్దెనపల్లి గురుకుల ప్రిన్సిపాల్ పద్మ, మొక్కల రాజశేఖర్, రుద్రంగి గాజుల శ్రీనివాస్, సుద్దాల గ్రామ సర్పంచ్ కుంటెల్లి నాగరాజు, కొనరావుపేట మార్కెట్ ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లన్న తదితరులు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
చిన్నారి ప్రకృతి బ్లెస్సీ సాధించిన ఈ ఘనత సుద్దాల గ్రామానికే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.