Karimnagar: మే 12న కరీంనగర్ జైత్రయాత్ర.. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాస్టర్ ప్లాన్!

Karimnagar: కరీంనగర్‌లో మే 12న జరగనున్న హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు.

Update: 2026-05-04 02:34 GMT

Karimnagar: మే 12న కరీంనగర్ జైత్రయాత్ర.. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాస్టర్ ప్లాన్!

కరీంనగర్: కరీంనగర్ లో ఈనెల 12న నిర్వహించే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను కనీవినీ ఎరగని రీతిలో దిగ్విజయవంతం చేసి మరోసారి చరిత్ర స్రుష్టిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ హిందూ ఏక్తా యాత్రకు చిన్నా, పెద్దా, ముసలి ముతకా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తరలివచ్చి హిందూ సంఘటిత శక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. యాత్రకు తరలివచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, వారికి తగిన రవాణా ఏర్పాట్లు చేసి యాత్రకు తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా ఏక్తా యాత్రపై మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం నిర్వహించాలని కోరారు. పార్టీ నాయకులంతా తమ తమ వార్డులు, గ్రామ, మండలాల్లో ఇంటింటికీ వెళ్లి వినూత్న రీతిలో బొట్టు పెట్టి ఏక్తా యాత్రకు రావాలని ప్రజలను ఆహ్వానించాలని సూచించారు. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ అభ్యర్థులు తమ తమ డివిజన్లలో భారీ ఎత్తున ప్రజలను ఏక్తా యాత్రలో పాల్గొనేలా భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.

హిందూ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన నేపథ్యంలో ఆ స్పూర్తితో ఏక్తా యాత్రను విజయవంతం చేద్దాం. మండలాల నుండి అధిక సంఖ్యలో తరలిస్తే వారంతా హిందుత్వం కోసం పనిచేసే యువకులుగా మారే అవకాశమిద్దాం. పండుగ వాతావరణంలో యాత్రకు తరలి రావాలని వినూత్న రీతిలో ప్రజలను ఆహ్వానించాలి. మే 12న, సాయంత్రం 4 గంటలకు, వైశ్యా భవన్ నుండి హిందూ ఏక్తా యాత్ర ప్రారంభం అనే అంశాన్ని ప్రతి ఒక్కరి మైండ్ లో ఫిక్స్ అయ్యేలా ప్రచారం చేయండి. ప్రతి వార్డులో, డివిజన్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి. వాల్ రైటింగ్ రాయించండి. రేపటి నుండే మండలాలు, గ్రామాల, పోలింగ్ బూత్ ల వారీగా మీటింగ్ నిర్వహించాలి. మీడియా, సోషల్ మీడియా వేదికలుగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించండి అని చెప్పారు.

ఈనెల 12న కరీంనగర్ లో నిర్వహించే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ ఏర్పాట్లు, జన సమీకరణపై కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని గాయత్రీనగర్ బ్యాంకెట్ హాలులో ఉదయం జిల్లా నాయకులతో, సాయంత్రం జ్యోతినగర్ లోని శ్రీ మహాశక్తి బాంక్వెట్ హాలులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, డి.శంకర్, కోమాల ఆంజనేయులు, గుగ్గిళ్ల రమేశ్, నల్లాల ఒదేలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News