Rayachoti: వైఎస్సార్‌సీపీ పోరుబాట కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ శ్రేణులు!

Rayachoti: రాయచోటి బంగ్లా వద్ద YSRCP రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ భృతి, ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వాన్ని నిరసించారు.

Update: 2026-08-06 07:37 GMT

Rayachoti: వైఎస్సార్‌సీపీ పోరుబాట కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ శ్రేణులు!

Rayachoti: డీఎస్సీ అక్రమాలు.. నిరుద్యోగ భృతి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట..!

ఎన్నికల సమయంలో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం రాయచోటి పట్టణంలోని బంగ్లా వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో అవినీతి, నిరుద్యోగ భృతి అమలులో జాప్యం, విద్యాదీవెన–వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ ఉద్యమానికి యువత, విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.

నియోజకవర్గం నలుమూలల నుంచి పోటెత్తిన యువశక్తి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ రిలే దీక్షలకు రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగ యువత, యువజన సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. బంగ్లా ప్రాంతం యువశక్తితో కిక్కిరిసిపోగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నినాదాలతో ఉద్యమ వేదిక హోరెత్తింది.

డీఎస్సీ-2025 స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి

డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవినీతిపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి అర్హులైన క్రీడాకారులు, యువతకు న్యాయం చేయాలని కోరారు.

రాయచోటి జిల్లా కేంద్రాన్ని పునరుద్ధరించాలి

రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడం ద్వారా ఈ ప్రాంత ప్రజల హక్కులు, మనోభావాలను దెబ్బతీసి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రాన్ని తిరిగి రాయచోటిలోనే పునరుద్ధరించాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి

విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి, ఫీజులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగ యువతను మోసం చేయొద్దు

ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిని రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడం యువతను మోసం చేయడమేనని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, మాజీ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్సార్‌సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, పట్టణ కన్వీనర్ నవాజ్, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Tags:    

Similar News