Kadapa: రేపటి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి 418వ జయంతి మహోత్సవాలు!

Kadapa: కాలజ్ఞాన ప్రవక్త, యుగపురుషుడు జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 418వ జయంతి మహోత్సవాలకు బ్రహ్మంగారి మఠం ముస్తాబైంది. ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మఠం మేనేజర్ పల్లకొండ పెంచల నరసింహ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

​మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వెంకటాద్రి స్వామి వారి దివ్య ఆశీస్సులతో, వారి ధర్మపత్ని ఉమాదేవి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలిరానున్నారని మేనేజర్ పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ పుణ్య వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

​నవంబర్ 20 (శుక్రవారం): ఉత్సవాల తొలిరోజున మఠాధిపతుల దంపతుల చేతుల మీదుగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పారాయణంతో వేడుకలు ప్రారంభమవుతాయి.

​నవంబర్ 21 (శనివారం ఉదయం): కార్తీక శుద్ధ ద్వాదశి, స్వామివారి అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 10:00 గంటలకు 418 కలశాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఊరేగింపుగా బ్రహ్మంగారి ఉద్యానవనంలోని శిలామూర్తి వద్దకు తీసుకెళ్లి విశేష క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, కలశ స్నపనం నిర్వహిస్తారు.

​నవంబర్ 21 (శనివారం రాత్రి) ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శాస్త్రోక్త దివ్య కళ్యాణ మహోత్సవం రాత్రి 7:30 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా జరగనుంది.

​నవంబర్ 22 (ఆదివారం): ముగింపు రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు భక్తులు, గ్రామస్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 6:00 గంటలకు నిర్వహించే 'కార్తీక సహస్ర దీపార్చన'తో ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి. వేయి దీపాల కాంతులతో మఠం ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోనుంది.

Tags: