AirPod: మందు బిళ్ల అనుకుని ఆపిల్ ఎయిర్‌పాడ్ మింగేసిన మహిళ.. కడుపులోంచి వాయిస్ మెసేజ్..!

AirPod: రాత్రి వేళ తీవ్ర పరధ్యానంలో ఉన్న ఒక అమెరికన్ మహిళ, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అనుకుని పొరపాటున ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను మింగేసింది.

Update: 2026-05-25 04:47 GMT

AirPod: మందు బిళ్ల అనుకుని ఆపిల్ ఎయిర్‌పాడ్ మింగేసిన మహిళ.. కడుపులోంచి వాయిస్ మెసేజ్..!

Carli Bellmer: రాత్రి వేళల్లో బెడ్‌పై పడుకుని ఫోన్ చూస్తూనో, లేదా రేపటి పనుల గురించో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండడం మనలో చాలా మందికి అలవాటే. కానీ, అమెరికాకు చెందిన ఒక మహిళకు ఈ పరధ్యానమే ఊహించని షాక్ ఇచ్చింది. నిద్రపోయే ముందు మందు బిళ్ల అనుకుని పొరపాటున ఏకంగా ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను మింగేసింది. ఆ తర్వాత ఆమె కడుపులో జరిగిన వింత వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన 27 ఏళ్ల కార్లీ బెల్‌మర్ ఒక పాడ్‌కాస్టర్. ఒకరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆమెకు తీవ్రమైన ఒంటి నొప్పులు రావడంతో.. ఉపశమనం కోసం 'ఐబూప్రోఫెన్ 800' అనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవాలని అనుకుంది. ఆ సమయంలో ఆమె తీవ్రమైన పరధ్యానంలో ఉంది. ఒక చేతిలో పెద్ద సైజులో ఉన్న ఐబూప్రోఫెన్ టాబ్లెట్, మరో చేతిలో తన ఎడమ చెవి ఆపిల్ ఎయిర్‌పాడ్ పట్టుకుంది. ఇంకేముంది.. ఆలోచనల్లో మునిగిపోయిన కార్లీ, టాబ్లెట్‌కు బదులుగా చేతిలో ఉన్న ఎయిర్‌పాడ్‌ను నోట్లో వేసుకుని నీళ్లతో గటగటా మింగేసింది.

కడుపులో ఎయిర్‌పాడ్.. ఫోన్‌లో బ్లూటూత్ కనెక్షన్

మింగిన కొద్దిసేపటికల్లా తాను చేసింది ఎంత పెద్ద తప్పో కార్లీకి అర్థమైంది. కంగారుగా వాంతి చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎయిర్‌పాడ్ బయటకు రాలేదు. అయితే, ఇక్కడే ఒక అత్యంత విచిత్రమైన, వింతైన సంఘటన జరిగింది. కడుపులోకి వెళ్లిన ఎయిర్‌పాడ్ అప్పటికీ ఆమె ఐఫోన్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యే ఉంది. ఆ కంగారులో కార్లీ తన స్నేహితురాలికి ఒక వాయిస్ మెసేజ్ పంపగా.. ఆ ఆడియో నోట్ కడుపులో ఉన్న ఎయిర్‌పాడ్ మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ అయి, వింత శబ్దాలతో స్పష్టంగా వినిపించింది.

ఎక్స్-రేతో గుట్టురట్టు

ఈ వింత అనుభవాన్ని కార్లీ టిక్‌టాక్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. "నేను పొరపాటున నా ఎయిర్‌పాడ్ మింగేశాను.. నా బుర్ర అస్సలు పనిచేయడం లేదు" అంటూ ఆమె కన్నీళ్లతో పెట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. క్షణాల్లోనే ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. మొదట్లో కొందరు నెటిజన్లు ఇది కేవలం వ్యూస్ కోసం చేసిన 'పబ్లిసిటీ స్టంట్' అని కొట్టిపారేశారు. కానీ, ఆ తర్వాత కార్లీ హాస్పిటల్‌కు వెళ్లి ఎక్స్-రే తీయించుకోవడంతో అసలు నిజం బయటపడింది. ఆమె కడుపులో ఎయిర్‌పాడ్ ఉన్నట్లు ఎక్స్-రేలో స్పష్టంగా కనిపించింది.

చివరకు ఏమైంది..?

ఆపిల్ ఎయిర్‌పాడ్‌లో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీ కడుపులో లీక్ అయితే ప్రాణాలకే ప్రమాదం కావడంతో డాక్టర్లు ఆమెను నిరంతరం పర్యవేక్షించారు. అయితే ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే, ఆమె జీర్ణవ్యవస్థ ద్వారా ఆ ఎయిర్‌పాడ్ సహజంగా, సురక్షితంగా బయటకు వచ్చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో కార్లీతో పాటు ఆమె ఫాలోవర్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News