Russia Ukraine War: ఉక్రెయిన్‌ మంట చల్లారేదెప్పుడు.. రష్యా మనసులో ఏముంది?

యుద్ధానికి విరామమేగాని, ఫుల్‌స్టాప్‌ ఉండేట్టు కనిపించడం లేదు. ఒకరు తగ్గితే మరొకరు నెగ్గాలని చూడటం వలన యూరప్‌లో ఈ రణం రోజు రోజుకు భీకరంగా మారుతున్నది. ఉక్రెయిన్‌లో రగులుకున్న జ్వాలలు ఆగేలా కనిపించడం లేదు.

Update: 2026-05-25 07:37 GMT

Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు దాటింది. ఇప్పటికీ ఈ యుద్ధం ముగింపు దశకు చేరుకోలేదు. విక్టరీ డే సందర్భంగా మూడు రోజులపాటు యుద్ధ విరామాన్ని మాత్రమే ప్రకటించారు. ఆ తరువాత మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. నాటో అండదండలతో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని చేస్తున్నది. ఆయా దేశాలు సమకూర్చే ఆయుధాలను రష్యాపై ప్రయోగిస్తున్నది. ఇటీవలే నాటో దేశాలు సమకూర్చిన యుద్ధ విమానాలు రష్యా భూభాగంలోకి ప్రవేశించి దాడి చేశాయి. ఈ దాడి తరువాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్‌ దళాలకు కీలక హెచ్చరికలు జారీ చేశాడు.

పుతిన్‌ హెచ్చరిక

ఉక్రెయిన్‌ సైన్యం దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తాము మరింత శక్తివంతంగా దాడులకు దిగుతామని ప్రకటించాడు. చెప్పినట్టుగానే రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన ఒరెష్నిక్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణితో దాడి చేసింది. యుద్ధం ప్రారంభమైన నాలుగేళ్లలో ఇలాంటి భయంకరమైన క్షిపణిని ప్రయోగించడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఈ క్షిపణులు సంప్రదాయ వార్‌ హెడ్‌లతో పాటు అణ్వస్త్రాలను కూడా ఈజీగా క్యారీ చేయగలవు.

ఉక్రెయిన్‌ రష్యా మధ్య జరుగుతున్న ఈ వార్‌ చూస్తుంటే రావణకాష్టం మాదిరిగా కనిపిస్తున్నది. రావణకాష్టం ఎప్పటికీ చల్లారదు అని చెప్పినట్టుగా...ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు దశకు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం పుతిన్‌ ఈ వార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడిన తరువాత...ఉక్రెయిన్‌తో యుద్ధం యుగింపు దశకు చేరుకుందని, త్వరలోనే శాంతి చర్చలు జరుగుతాయని, శాంతి పునరుద్దరించబడుతుందని చెప్పాడు. ఇదే సమయంలో మే 9కి మూడు రోజుల ముందే కాల్పుల విరమణను ప్రకటించారు.

భారీ దాడులు

ఆ తరువాత కూడా కాల్పుల విరమణ ఒప్పందం పెరిగే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ, ఉక్రెయిన్‌ నాటో దేశాల యుద్ధవిమానాలతో రష్యాపై మరోసారి దాడులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రతిగా రష్యా 90 క్షిపణులు, 600 డ్రోన్లతో విరుచుకుపడింది. అదీ కూడా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై దాడులు చేసింది. దీంతో ఈ ప్రాంతమంతా బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. 13వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఒరెష్నిక్‌ క్షిపణి మొదటిసారి ప్రయోగించినపుడు కేవలం అభివృద్ధి దశలో ఉన్నది. కాగా, ఇప్పుడు ఈ క్షిపణి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో రణం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, నాటో దేశాలకు పుతిన్‌ దీని ద్వారా హెచ్చరిక కూడా జారీ చేశాడు. తమ జోలికి వస్తే ఇలాంటి క్షిపణులను ఆయా దేశాలపై కూడా ప్రయోగించే అవకాశం ఉంది. ధ్వనివేగం కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణం చేయడం ఈ ఒరెష్నిక్‌ క్షిపణి ప్రత్యేకత.

ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని రష్యా అనుకోవడం లేదు. కానీ, ఉక్రెయిన్‌లో నాటోకు అనుకూలమైన పాలనకు స్వస్తిపలికి, రష్యాకు అనుకూలమైన పాలనను తీసుకురావాలన్నదే లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరే వరకు ఈ యుద్ధం ఆగుతుందా అంటే లేదనే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. మరి ఇలా ఎంతకాలం అన్నది ఆ కాలమే నిర్ణయించాలి.   

Tags:    

Similar News